బీజేపీ నాయకులే ప్రధాని మోడీని పూర్తిగా నమ్మలేమని నెత్తినోరూ కొట్టుకుంటున్నారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో దగాపడ్డ ఆంధ్రులు అయితే మోడీ పేరు ఎత్తితేనే మండిపడుతున్నారు. అలాంటి ఆంధ్రులు ఓటు వేస్తే సీఎం కుర్చీలో కూర్చోవాలని కలలు కంటున్న వైసీపీ అధినేత జగన్ కి మాత్రం మోడీ నమ్మదగ్గ వ్యక్తిగానే కనిపిస్తున్నారు. ఓ వైపు ప్రత్యేక హోదా కోసం అంటూ వైసీపీ తో ఆందోళన చేయిస్తూ ఇంకోవైపు బీజేపీ కి ఎక్కడ కోపం వస్తుందో అన్న భయంతో తమ ఆందోళనలు చూసి ప్రధాని మోడీ ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తారని ఆశిస్తున్నట్టు జగన్ చేసిన ట్వీట్ చూసి ఆ పార్టీ శ్రేణులే ఆశ్చర్యపోయాయి.
రాజకీయ నాయకులు రాజకీయాలే చేస్తారు. అందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఎన్నికల ఏడాది కూడా చేసే రాజకీయం రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి చేయడం చూసిన జనాలు తిరిగి తమకు వేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతారని ఆశించడం మాత్రం అత్యాశ. లేకుంటే జనాన్ని ఇవన్నీ తెలియని అమాయకులుగా భావించి అయినా ఉండాలి. ఎవరు అమాయకులో, ఎవరు తెలివిగల వాళ్ళో 2019 ఎన్నికల తర్వాత అర్ధం అవుతుంది.