వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నిన్నటి రోజున తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి శివారు నుంచి ప్రారంభమై గిడిజామ్, ఎస్.అగ్రహారం మీదుగా పారుపాక క్రాస్ వరకు కొనసాగింది. అయితే, డీజేపురం వరకు పాదయాత్ర కొనసాగాల్సి ఉ౦డగా వర్షం కారణంగా ఉదయం పూట యాత్ర రద్దు కావడంతో కుదించారు. వర్షం కారణంగా ఆపిన పాదయాత్ర మధ్యాహ్నం 1.30 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు జగన్‌ను కలిసి కుడుంపాత్రుడుచెరువు మినీ ప్రాజెక్టు గా ఏర్పాటు చేసినట్టయితే సుమారు పది గ్రామాల ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని విన్నవించారు.
అనంతరం గిడజాం గ్రామంలో జగన్‌కు భారీ స్వాగతం లభించింది. గ్రామంలో సమస్యలపై డ్వాక్రా మహిళలు వినతిపత్రాలు అందజేశారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మహిళలకు జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఎస్ అగ్రహారం గ్రామంలో యాత్రను ప్రారంభించారు. అయితే గిడిజామ్ ప్రాంతానికి జగన్ చేరుకోగానే ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. జగన్ వచ్చే మార్గంలో గ్రామస్తులు వరుసగా చీరలు పరిచి ఆశ్చర్య పరిచారు. వాటిపై జగన్ నడుచుకుంటూ వెళ్లారు. గిడజాం గ్రామంలో అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో సుమారు గంటన్నరపాటు ప్రజాసంకల్పయాత్ర సాగింది.