ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అంబులెన్స్ అనే మాట ఎక్కడ ప్రస్తావించినా కుయ్..కుయ్.. మంటూ శబ్దాన్ని వినిపించి తండ్రి వైఎస్ 108 శబ్దాన్ని గుర్తు చేస్తుంటారు. అయితే ఈవారంలోనే బుధవారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తుండగా ఓ గర్భిణి ఆ మార్గంలో ఆటోలో వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ కాసేపు తన ప్రసంగాన్ని ఆపి.. ఆ ఆటోకు దారి ఇవ్వాల్సిందిగా అభిమానుల్ని కార్యకర్తలను కోరారు. ఆ వాహనం వెళ్లే వరకు ఆ గర్భిణీకి దారి ఇవ్వాలని కోరుతూనే ఉన్నారు. మొత్తానికి వైఎస్ జగన్ మానవతను చాటుతూ ఆ ఆటోకు దారిచ్చేలా సహాకరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 108 అంబులెన్స్ సేవల గురించి ప్రస్తావించారు. అంబులెన్స్‌లు లేక ఆపదలో ఉన్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ ఘటన మనకు కళ్ళకు కట్టిందని తెలిపారు. 108కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లోనే అంబులెన్స్ కుయ్.. కుయ్.. కుయ్.. మంటూ వచ్చేదని.. కానీ నేడు ఆ పరిస్థితి లేదని ఆ సమయంలో వెల్లడించారు.
కానీ నిన్న అదే జిల్లాలో మరో సభలో జగన్ ప్రసంగిస్తున్న సమయంలో అంబులెన్స్ రావడంతో అందుకు విరుద్ధంగా చలోక్తులు విసిరారు జగన్. మనం మాట్లాడే మాటలు వింటున్నారు కనుకనే, ‘అంబులెన్స్’ ఇంకా బతికే ఉందని చూపించడం కోసం దీనిని ఇటువైపు పంపించారని అన్నారు. ఇక్కడ రోడ్డు లేకపోయినప్పటికీ ఈ జనంలో నుంచి అంబులెన్స్ ను తీసుకువెళ్లాలని చూస్తున్నారంటే. ‘ఇంతకన్నా సిగ్గులేని ప్రభుత్వం, ఇంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? అయ్యా, చంద్రబాబునాయుడుగారు, నీకు సిగ్గులేదని చెప్పడానికి ఇదే నిదర్శనం. బండి పోవడానికి దారి లేదని కనిపిస్తూనే ఉంది.. వేరే దారిలో పోకుండా.. ఇదే దారిలోనే పోతోంది’ అని మండిపడ్డారు. ‘వాళ్లు ఏ నికృష్టపు ఆలోచనతో చేసినా.. మనమైతే మంచే చేద్దాం..దారివ్వండి .. కొద్దిగా దారివ్వండి’ అంటూ అంబులెన్స్ కు వెంటనే దారి ఇవ్వాలని సభకు హాజరైన ప్రజలను, తమ కార్యకర్తలను జగన్ కోరారు. ‘అందులో పేషెంట్ ఎవరూ లేరన్న సంగతి అందరికీ తెలుసు.. రానీ..రానీ’ అని జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.