Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కులాన్ని,మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం దేశరాజకీయాల్లో సర్వసాధారణం. అయితే ఎంతో సున్నితమైన ఈ అస్త్రాల్ని వాడడం ఎలాగో తెలియకపోతే, మనం ప్రయోగించే అస్త్రాలకి ప్రతి చర్య ఉంటుందని అర్ధం చేసుకోకపోతే అవే ఆయుధాలు ఎదురు తిరుగుతాయి. ప్రయోగించిన వారి మెడకే చుట్టుకుంటాయి. ఇప్పుడు హఠాత్తుగా శ్రీవారిని, స్వామీజీల్ని కలవడం ద్వారా హిందూ ఓట్లని కొల్లకొడదాం అనుకున్న జగన్ కి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. అయితే ఇది గతం నేర్పిన పాఠాల్ని తప్పుగా అర్ధం చేసుకున్న ఫలితమే. అదెలా అంటే …
2014 ఎన్నికల్లో జగన్ సహా ఆయన కుటుంబ సభ్యులంతా తాము క్రైస్తవ మతానికి ప్రతినిధులం అన్నట్టు ఎక్కడ చూసినా బైబిల్ పట్టుకు తిరిగారు. అప్పట్లో దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆ తీరు మారలేదు. ఎన్నికల తర్వాత ఆ ఆలోచన ఫలించలేదని అర్ధం అయ్యింది. పైగా దీని వల్ల ఇతర మతస్తులు దూరం అయ్యారని జగన్ అండ్ కో భావించింది. అందుకే ఆ ఎన్నికల తర్వాత హిందూ సమాజాన్ని ఆకట్టుకోడానికి స్వామీజీల్ని కలవడం, హరిద్వార్ లో పూజలు చేయడం, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడం లాంటి వాటితో జగన్ రూట్ మారింది. దీంతో హిందూ సమాజం ఖుషీ అయ్యిందో లేదో తర్వాత సంగతి కానీ క్రైస్తవ వర్గాల్లో అసంతృప్తి వస్తోంది. తిరుపతికి చెందిన పోస్టర్ డేవిడ్ కరుణాకర్ ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించారు. జగన్ సీఎం అవుతాడని తాము కోరుకుంటే ఆయన విగ్రహారాధన చేయడం వల్ల ఆ లక్ష్యం నెరవేరడం లేదని అన్నారు. ఇందులో నిజానిజాలు వెదకడం కన్నా క్రైస్తవ సమాజం అసంతృప్తికి ఈ కామెంట్స్ అద్దం పడుతున్నాయి .
అటు చూస్తుంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయలేదని జగన్ మీద ఇటు హిందూ సమాజం కూడా ఆగ్రహంతో రగిలిపోతోంది. మత సెంటిమెంట్ తో రాజకీయం చేయాలని చూసిన జగన్ నిజానికి ఆ సాలెగూడులో చిక్కుకుని అల్లాడుతున్నారు. 2014 ఫలితాల తర్వాత జగన్ ఇంకో రకంగా అంటే… మతాన్ని రాజకీయాలతో ఎక్కువ ముడిపెట్టకుండా ఉంటే బాగుండేదని ఆలోచించగలితే ఇప్పుడు ఈ సమస్య ఎదురయ్యేది కాదు. కానీ ఫలితాన్ని తమ దృష్టికోణంలో మాత్రమే ఆలోచించినప్పుడు ఎదురైన పరిణామం ఇది. ఇప్పుడు మతాల మధ్య చిక్కుకున్న జగన్ ని ఏ దేవుడు ఆదుకుంటాడో మరి.