ఎప్పటినుంచో అనుకుంటున్న ఓ లాంఛనం పూర్తి అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు నాలుగైదేళ్ల తర్వాత తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్ర విభజన జరగకుండా ఆపడానికి చివరిదాకా ప్రయత్నం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో సమైక్యవాదుల కి హీరో అయ్యారు. విభజన వాదులకి విలన్ కావడంతో తనను సీఎం పీఠం మీద కూర్చోబెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ కి తలనొప్పిగా మారారు. అయితే ఎప్పుడు అయితే విభజన నిర్ణయం జరిగిపోయిందో అప్పుడు కిరణ్ సమైక్యవాదనకు అర్ధం లేకుండా పోయింది. అయినా అదే వాదంతో పార్టీ ఏర్పాటు చేసిన కిరణ్ కి 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది.
ఎన్నికల రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ సమైక్య ఏపీ కోసం హైకమాండ్ ని కూడా ఎదిరించిన నాయకుడిగా కిరణ్ కి ఓ ఇమేజ్ అయితే వచ్చింది. ఆ ఇమేజ్ కోసమే ఒకప్పుడు తమని ధిక్కరించిన కిరణ్ ని కాంగ్రెస్ హైకమాండ్ తిరిగి దగ్గరకు తీసుకోడానికి కారణం అయ్యింది. పైగా విభజన చేస్తే ఏపీ లో పార్టీకి పుట్టగతులు ఉండవని , తెలంగాణాలో కూడా భావుకునేది ఏదీ ఉండదని అప్పట్లో కిరణ్ చేసిన హెచ్చరికలు నిజాలై కాంగ్రెస్ హైకమాండ్ కళ్ళు తెరిపించాయి.
ఇటు కిరణ్ సైతం 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏ పార్టీ లో చేరడానికి పెద్దగా సుముఖత చూపించలేదు. సమైక్య హీరోగా ఆయన ఇమేజ్ వాడుకోవాలని బీజేపీ, టీడీపీ సైతం గట్టి ప్రయత్నాలు చేసినా కిరణ్ కి ఎక్కడో ఇబ్బంది అనిపించేది. అలాంటి సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వచ్చిన పిలుపుతో కిరణ్ సానుకూలంగా స్పందించారు. విభజన హామీలు నెరవేర్చడంలో బీజేపీ రిక్త హస్తం చూపించిన నేపథ్యంలో ఆ హామీల అమలు నినాదంతో మళ్లీ ఏపీ లో పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ కి కిరణ్ రైట్ ఛాయస్ అనిపించారు. ఇద్దరికీ ఒకరితో ఒకరికి అవసరం ఉండటం కూడా ఈ కాంబినేషన్ సెట్ కావడానికి పనికి వచ్చింది. ఈ పనిని సులువుగా చేయడానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఏపీ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీ అనుభవం పనికొచ్చింది.
హైకమాండ్ విభజన హామీల అమలు కి ఓకే అని చెప్పడంతో కిరణ్ కాంగ్రెస్ చేరికకు రంగం సిద్ధం అయ్యింది. ఢిల్లీ చేరుకున్న కిరణ్ ముందుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. ఓ అర్ధగంట చర్చల అనంతరం ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ పరిణామం మీద అందరికంటే ఎక్కువ ఆందోళన చెందుతోంది వైసీపీ అధినేత జగన్. వైసీపీ దెబ్బ తింటేనే కాంగ్రెస్ పుంజుకుంటుందని హైకమాండ్ ని ఒప్పించి అందుకు తగ్గ అస్త్ర, శస్త్రాలతో కిరణ్ రంగంలోకి దిగడంతో జగన్ హడలిపోతున్నారు. బీజేపీ తో అంటకాగుతున్న వైసీపీ కి దూరం అవుతున్న మైనారిటీలు, ఎస్సీలు తిరిగి కాంగ్రెస్ చెంతకు చేరితే ఎదురయ్యే ఇబ్బందులు తెలుసు కాబట్టే జగన్ ఆందోళన చెందుతున్నారు. అయితే బీజేపీ దూరం అయ్యే పరిస్థితులు లేవు. ఆ విధంగా కాంగ్రెస్ లో కిరణ్ చేరిక జగన్ కి ముందు గొయ్యి వెనుక నుయ్యి లాంటి పరిస్థితి తెచ్చిపెట్టింది.