Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలు తప్ప అనే విశ్లేషణ నిజమని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు వైసీపీ అధినేత జగన్. 2014 ఎన్నికలకు ముందు వైసీపీ విజయం ఖాయం అని ఆయనే కాదు రాజకీయ ఉద్దండులు ఎందరో అనుకున్నారు. అయితే ఆ అంచనాలు తారుమారు అయ్యాయి. అందులో జగన్ వ్యూహాత్మక తప్పిదాలు ఎన్నో ఉన్నాయని విశ్లేషణలు వచ్చాయి. అయితే వాటిని పెద్దగా లెక్క చేయని జగన్ తనకు నచ్చింది చేసుకుంటూ వెళుతున్నారు. తాను గెలవడం ఎలాగా అన్న విషయాన్ని పక్కనబెట్టి చంద్రబాబుని ఓడించడం ఎలా అన్న దగ్గరే ఆగిపోతున్నారు.
అందుకే 2014 లో బాబు విజయానికి కారణం అన్న ఆలోచనతో తనకు రాజకీయంగా అండగా వుంటూ వస్తున్న ఎస్సీ , మైనారిటీ వర్గాల అభిప్రాయాలని గౌరవించకుండా మునిగిపోతున్న మోడీ నావ ఎక్కేస్తున్నారు. బీజేపీ తో ఉంటే మునిగిపోతామని అక్కడ ఉన్నవాళ్లే దూరం అవుతుంటే ఆ విషయాన్ని పట్టించుకోకుండా బాబు ని ఇబ్బంది పెట్టడం అన్న కోణంలో రాజకీయం నడిపిస్తున్నారు. అందుకే ప్రత్యేక హోదా సహా వివిధ విషయాల్లో బీజేపీ మీద వైసీపీ పోరాటం చేస్తోంది అంటే నమ్మలేని పరిస్థితి.
ఇప్పుడు దాకా వేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు బీజేపీ ని నమ్ముకుని ఇంకో ప్రమాదంలో చిక్కుకోడానికి జగన్ రెడీ అవుతున్నారట. ఎంపీలతో పాటు ఎమ్మెల్యే లతో కూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లి హోదా కోసం ఉద్యమం చేస్తుంటే టీడీపీ పోటీకి దిగుతోందని ప్రచారం చేయించాలని జగన్ ఆరాటం. ఆ ఎన్నికల్లో గెలిచి వైసీపీ బలం పెరిగిందని 2019 ఎన్నికలకు ముందే ఓ సంకేతం ఇవ్వడం జగన్ ఉద్దేశం. కానీ ఆయన అక్కడే పప్పులో కాలేస్తున్నాడు. ఉప ఎన్నికలకు తెర లేపి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు. అధికారంలో ఉండగా చంద్రబాబుని ఉపఎన్నికల్లో ఢీకొట్టడం తేలిక కాదని నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికలతో రుజువైంది. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేసి ఉప ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటే వైసీపీ పరిస్థితి ఏంటి ?. ఈ విషయం ఆలోచించకుండా బీజేపీ ఉచ్చులో చిక్కుకుంటే మాత్రం 2019 ఎన్నికలకు ముందే జగన్ పని అయిపోయే ముప్పుంది.