Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పాదయాత్ర కి రెడీ అవుతున్నాడు వైసీపీ అధినేత జగన్. అయితే తాను ఎంత పాదయాత్ర చేసినా మీడియా కవరేజ్ లేకపోతే నష్టం ఏంటో జగన్ కి అర్ధం అయ్యింది. అందుకే ఓ వైపు సొంత పత్రిక సాక్షి ఉన్నప్పటికీ మిగిలిన మీడియా సాయం కూడా కోరాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటగా మీడియా మొఘల్ రామోజీని కలిసి ఆశీర్వాదాలు తీసుకోవడమే కాకుండా పాదయాత్ర కవరేజ్ బాగా ఇవ్వమని కోరి వచ్చారు. ఒకప్పుడు ఈనాడు, సాక్షి మధ్య గొడవ, రామోజీ ని రాజగురివింద అంటూ సాక్షిలో వచ్చిన కధనాలు చూసిన వాళ్లకి ఈ భేటీ ఆశ్చర్యకరమే. అయితే పంతాలు పట్టింపులు కన్నా అధికారమే మిన్న అన్న జగన్ ఆలోచనకి ఈ సమావేశం అద్దం పట్టింది. అయితే ఈ బతిమాలాట ఒక్క రామోజీతోనే కాదట.
ప్రధాన, చిన్న చిన్న పత్రికల్లో, న్యూస్ చానెల్స్ లో పనిచేసే ముఖ్యమైన జర్నలిస్టులతో కూడా నేడు, రేపు జగన్ సమావేశం అయ్యే అవకాశం ఉందట. ఈ సమావేశం లో తన పాదయత్రకి విస్తృతమైన కవరేజ్ ఇవ్వాలని ఆయన కోరుతారట. జగన్ లో వచ్చిన ఈ మార్పు ఆయనలో హీరోని చూసుకున్న కార్యకర్తలు కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక నేతలు, విశ్లేషకులు అయితే జగన్ లో ఇంత మార్పా అని ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఇదే విషయం మీద విలేకరులు కొందరు చర్చించారట. ఎక్కువ మంది జగన్ మారిపోయాడు అన్న మాట వైపే మొగ్గు జూపారట. ఆంధ్రజ్యోతిలో పని చేసే ఓ రిపోర్టర్ దీనికి ఒప్పుకోలేదట. జగన్ మా చైర్మన్ రాధాకృష్ణ ని కలిసి పాదయాత్ర కి కవరేజ్ ఇవ్వమని కోరితే అప్పుడు ఆయన మారినట్టు ఒప్పుకుంటానని అన్నాడట. ఆ మాటకి అప్పటిదాకా జగన్ మార్పు గురించి తెగ చెప్పిన విలేకరుల గొంతులు పెగల్లేదట. ఎందుకంటే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ చెప్పిన మాటల్లో నిజముంది. ఆర్కేని కలిస్తే నిజంగా జగన్ మారినట్టే.