Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2014 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ కి కాబోయే రాజధాని దొనకొండ అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం ఆ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందన్న నమ్మకమే. వైసీపీ గెలిస్తే ప్రకాశం జిల్లా దొనకొండలో రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా రాయలసీమకు దగ్గరగా కాపిటల్ ఉండేలా జగన్ నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ నేతలు భావించారు. తద్వారా ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో రెడ్ల ప్రాబల్యం కోసం జగన్ దొనకొండని రాజధానిగా అనుకున్నారని ప్రచారంతో వైసీపీ నేతలు అక్కడ పెద్ద ఎత్తున భూములు కొన్నారు. కానీ ఆ ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ కి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో దొనకొండ మీద ఆశలు వమ్మయ్యాయి. కానీ ఇప్పటికీ కొందరు దొనకొండ చుట్టూ కలలు కంటున్న విషయం తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. కానీ అది నిజం.
2019 ఎన్నికల్లో వైసీపీ 100 స్థానాలకు పైగా గెలిచి జగన్ సీఎం అయితే రాజధాని మారుస్తారని కొందరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం నమ్మి ఆ ప్రాంతంలో భూములు కొనడానికి ఇంకొందరు ఆలోచిస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇలా జరుగుతుందన్నది పచ్చి నిజం. దొనకొండలో తగ్గిన భూముల ధరల్ని పెంచడానికి కొందరు దళారులు ఇలా ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని నమ్మే కొందరు అమాయకులు దొనకొండలో మార్కెట్ కి మించి ధర పెట్టి భూములు కొనడానికి వస్తున్నారని తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది వైసీపీ అభిమానులే. రాజధాని మార్పు అసాధ్యం అని అందరికీ తెలుసు. ఈ ప్రచారం ముసుగులో సాగుతున్న మోసానికి అడ్డుకట్ట వేయాల్సివుంది.