Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీలో ప్రత్యేక హోదా కోసం అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కుతున్నారు. ఓ పక్క వైకాపా ఎంపీలు అటు ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తుంటే… వారికి మద్దతుగా హోదా కోసం పార్టీ శ్రేణులు ఏపీలో ఆందోళనలు చేస్తున్నాయి. నిన్న హైవేలను దిగ్బంధించగా ఈరోజు రైల్ రోకోకు పార్టీ పిలుపునిచ్చింది. దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ముట్టడించారు. పట్టాల మీద కూర్చును రైళ్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు. ఇక ముందే ప్రకటించిన రైల్ రోకో విషయంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్ల దగ్గర భారీగా బలగాలను మోహరించారు.
గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు తదితర ప్రాంతాల్లో పట్టాలపైకి చేరిన వైకాపా కార్యకర్తలు రైళ్లను అడ్డుకున్నారు. గుంతకల్లులో ఓ ప్యాసింజర్ రైలును స్టేషన్లో కాకుండా వూరి చివరనే వైకాపా కార్యకర్తలు అడ్డుకోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గుంతకల్ జంక్షన్ లో కర్ణాటక ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తిరుపతి నుంచి వస్తున్న కృష్ణా ఎక్స్ ప్రెస్ ను నిరసనకారులు అడ్డుకున్నారు. దీంతోదూరప్రాంతాలకు వెళ్లాల్సిన పలు రైళ్లను ప్రధాన స్టేషన్లలో నిలిపినట్టు తెలుస్తోంది. పరిస్థితిని సమీక్షించిన తరువాత వాటిని వదిలిపెట్టనున్నట్టు రైల్వే వర్గాలు ప్రకటించాయి.
ఇక కడప రైల్వేస్టేషన్ వద్ద పోలీసులకు, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వావాదం చోటు చేసుకొంది. ఎమ్మెల్యేలను మాత్రమే రైల్వేస్టేషన్ లోకి అనుమతి ఇస్తామని పోలీసుల ప్రకటించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కడప రైల్వే స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. నెల్లూరు జిల్లాలో రైలు రోకోకు దిగిన ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఈ ఆందోళనలతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వైసీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.