Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత నెల రోజుల క్రితమే పార్లమెంట్ సమావేశాల చివరి రోజున రాజీనామా చేస్తామని ప్రకటించిన వైసీపీ ఎంపీలు ఈరోజు సమావేశాలు వాయిదా పడిన కాసేపటికి తమ పదవులకు రాజీనామాలు చేశారు. వైసీపీకి చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు రాజీనామాలు స్పీకర్‌కు సమర్పించారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా తాము రాజీనామా చేసినట్టు వారు పేర్కొన్నారు. ముందుగా స్పీకర్ సుమిత్రా మహాజన్ అప్పాయింట్మెంట్ కోరిన వైసీపీ ఎంపీలు ఆమెని నేరుగా ఆమె ఛాంబర్ లోనే కలసి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా రాజీనామాలపై పునరాలోచించుకోవాలని లోక్‌సభ స్సీకర్ సుమిత్రా మహాజన్ వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులకు సూచించారు. ఎంపీలుగా కొనసాగుతూనే పోరాటం చేయాలని కోరారు.
అయితే తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర హక్కుల కోసం రాజీనామాలు చేస్తున్నామని వైసీపీ ఎంపీలు ఆమెకి తెలిపినట్లు తెలిసింది. “హోదా కోసం పోరాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నాం” అని వైఎస్‌ఆర్‌సీపీ లోక్‌సభ సభ్యులు తమ లేఖలో పేర్కొన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి (నెల్లూరు), అవినాష్ రెడ్డి (కడప), మిథున్ రెడ్డి (రాజంపేట), వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు), వరప్రసాద్ (తిరుపతి) – ఈ ఐదుగురూ లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా పత్రాలని సమర్పించారు. ఈ రాజీనామాలని వెంటనే ఆమోదించవలసిందిగా కోరారు. అనంతరం వారు అక్కడ నుంచి ఏపీ భవన్ కు బయల్దేరారు. స్పెషల్ స్టేటస్ కోసం ఏపీ భవన్ లో ఆమరణదీక్షకు దిగనున్నారు. ఢిల్లీలో దీక్షకు దిగనున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలకు మద్దతుగా ఏపీ వ్యాప్తంగా అన్ని చోట్లా సంఘీభావ దీక్షలకు వైసీపీ పిలుపునిచ్చింది.