హైదరాబాద్లో బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం, పరేడ్ గ్రౌంగ్స్ ప్రధాని మోదీ బహిరంగ సభ తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి తీరుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే తమ ప్రథమ ప్రాధాన్యమని బీజేపీ అగ్రనేతలు స్పష్టం చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో అమిత్ షా ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానం బీజేపీ తదుపరి ఎదుగుదల దక్షిణాది నుంచి కనిపిస్తుందని. ప్రత్యేకంగా తెలంగాణ, తమిళనాడులో ఉంటుందని స్పష్టంగా పేర్కొంది.. ఈ క్రమంలోనే బీజేపీ ప్రణాళికలను ఎదుర్కొనే విధంగా రాజకీయ వ్యుహాన్ని రచించుకోవాల్సి ఉందని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.ఈ అంశంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశాలు జూన్ చివరి వారంలోనే జరగాల్సి ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలను చర్చించి.. వాటికి చెక్ పెట్టేందుకు కౌంటర్ స్ట్రాటజీని సీఎం కేసీఆర్ రూపొందించనున్నట్టుగా తెలుస్తోంది