Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అత్యాచార బాధితురాలిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కిరణ్ ఖేర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలపాలవుతున్నాయి. చండీగఢ్ లో 22 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. ఆమె ఎక్కిన ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి తెగబడ్డారు. చండీగఢ్ లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయిన నేపథ్యంలో ఆ నియోజకవర్గ ఎంపీ అయిన కిరణ్ ఖేర్ స్పందించారు. అత్యాచార నిందితులను తప్పుపట్టడం కాకుండా…. బాధితురాలు జాగ్రత్తపడాల్సింది అని కిరణ్ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఆటోలో అప్పటికే ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, అటువంటప్పుడు ఆ యువతి అప్రమత్తంగా ఉండి ఆ ఆటో ఎక్కకుండా ఉంటే బాగుండేది కదా అని ఆమె అన్నారు. అమ్మాయిలు ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా ఆమె సూచించారు.
ఇంతటిటో ఆగకుండా అమ్మాయిల తల్లిదండ్రులకు కూడా కొన్ని ఉచిత సలహాలు ఇచ్చారు. మగపిల్లలను జాగ్రత్త చేయడం మాట అటుంచి తల్లిదండ్రులు తమ అమ్మాయిలకు కూడా తగిన సూచనలు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తాను కూడా ముంబైలో ఉన్నప్పుడు టాక్సీల్లో ప్రయాణించేదాన్నని, అయితే టాక్సీ ఎక్కినప్పుడు వాటి నంబర్లు రాసుకునేదాన్నని ఆమె చెప్పారు.
మీడియాను కూడా కిరణ్ ఖేర్ వదిలిపెట్టలేదు. ఇలాంటి సమయాల్లో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించకూడదని ఆమె వ్యాఖ్యానించారు. జాగ్రత్త చర్యలను, పోలీసుల టోల్ ఫ్రీ నంబర్లను విరివిగా ప్రచారం చేయాలని సూచించారు. కిరణ్ వ్యాఖ్యలపై విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మరోసారి స్పందించిన ఆమె తన వ్యాఖ్యలను వెనక్కితీసుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, మహిళలను చైతన్యవంతం చేసేందుకే తాను అలా మాట్లాడాను తప్ప…ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. అనవసరంగా తన వ్యాఖ్యలను రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే ఈ మొత్తం ఘటనలో అత్యాచార నిందితులపై ఆమె ఎలాంటి వ్యాఖ్యలూ చేయకపోవడం గమనార్షం.