Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జయలలిత మరణం తర్వాత రోజుకో మలుపుతిరుగుతున్న తమిళనాడు రాజకీయాలు ఇంకా ఓ కొలిక్కిరాకముందే అమ్మకు సంబంధించి ఇప్పుడు మరో విషయం వెలుగుచూసింది. జయలలిత మరణం సమయంలో అటు సామాన్య ప్రజల్లోనూ, ఇటు సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ అంశం బాగా ప్రచారంలో నిలిచింది. శోభన్ బాబుకు, జయలలితకు ఓ కుమార్తె ఉందని…ఆ కుమార్తె ఈమే నంటూ ఓ ఫొటో్ను కూడా సోషల్ మీడియా షేర్ చేసింది. దీనికి సంబంధించిన నిజానిజాలు ఎవరికీ తెలియకపోవటంతో అందరూ ఆ పొటోలో ఉన్నది జయలలిత కూతురే అనుకున్నారు. కానీ సింగర్ చిన్మయి ఈ ప్రచారాన్ని ఖండించింది.
ఆమె జయలలిత కూతురుకాదని, తనకు బాగా తెలిసిన ఫ్రెండని చిన్మయి పోస్ట్ చేయటంతో ఆ ప్రచారం అంతటితో ఆగిపోయింది. తాజాగా ఓ మహిళ తానే జయలలిత, శోభన్ బాబు కూతురునంటూ తెరమీదకువచ్చింది. బెంగళూరుకు చెందిన అమృత అనే మహిళ తాను జయలలిత కూతురునని చెప్పుకుంటోంది. ఇందుకోసం డీఎన్ ఏ టెస్టుకయినా సిద్ధమేనంటోంది. తల్లిదండ్రులను కోల్పోయి మానసికంగా కుంగిపోయిన దశలో ఉన్న తన తల్లి జయలలిత శోభన్ బాబు సాహచర్యంతో కోలుకున్నారని…వారిద్దరి ప్రేమకు గుర్తుగానే తాను జన్మించానని అమృత చెప్పారు. సామాజిక కట్టుబాట్ల నేపథ్యంలో వారిద్దరికీ పెళ్లి జరగలేదని, తన బాధ్యతను జయలలిత ఆమె సోదరి శైలజ, భర్త సారధి దంపతులకు అప్పగించారని తెలిపారు.
1996లో్ పెంపుడుతల్లి శైలజ సలహా మేరకు జయలలితను కలిశానని, అప్పుడు ఆమె తనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుందని అమృత చెప్పారు. తర్వాత కాలంలో జయను పలుమార్లు కలిసినా…తానే తల్లిననే విషయం ఆమె ఎప్పుడూ తనతో చెప్పలేదని అమృత అన్నారు. తన తల్లిది సహజ మరణం కాదని, శశికళ, ఆమె భర్త నటరాజన్ లు కుట్రచేసి ఆమెను చంపారని అనుమానం వ్యక్తంచేశారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్రపతి కోవింద్, ప్రధానమంత్రి మోడీకి అమృత లేఖలు రాశారు. అమ్మ మరణించిన తరువాత దీప, దీపక్ లు జయ ఆస్తికి వారసులమని చెబుతున్నారని…అది చూసిన అమెరికా, బెంగళూరులోని బంధువులు తనకు అసలు విషయం చెప్పారని అమృత అంటున్నారు. మొత్తమ్మీద జయలలిత, శోభన్ బాబుకు ఓ కుమార్తె ఉందన్న ప్రచారం నేపథ్యంలో తానే కూతురి నంటూ అమృత తెరమీదకు రావటం సంచలనంగా మారింది.
మరిన్ని వార్తలు: