నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్టు ఈ మేరకి తెలుగుదేశం పార్టీలో ఉన్న మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైందని తెలుస్తోంది. ఆయన వచ్చే వారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారట. ఉదయగిరి, వెంకటగిరి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్ స్థానాల్లో ఒక స్థానాన్ని ఆశిస్తున్నారని ఈ మేరకు వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఆనం కుటుంబం జిల్లాలో చక్రం తిప్పింది. రాంనారయణ రెడ్డితో పాటు ఆయన సోదరుడు వివేకానందరెడ్డి కూడా మంత్రులుగా పనిచేశారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆనం కుటుంబం కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశంలో చేరింది. అయితే, టీడీపీలో వారికి ఆశించిన గుర్తింపు దక్కలేదని వారు ఆదిస్థానం మీద గుర్రుగా ఉన్నారు. దీంతో గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే వైసీపీ అధినేత జగన్ ని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి కలవడం కూడా ఈ అనుమానాలకి ఊతమిస్తోంది. ఆనం రాంనారాయణరెడ్డి జగన్ ని రహస్యం గా కలిశారు. పాదయాత్ర లో ఉన్నపుడు కలిస్తే మీడియా ఫోకస్ వచ్చే అవకాశం ఉండటంతో జగన్ ని ఏకాంతంగా కలిసి నట్టు సమాచారం. అక్రమాస్తుల కేసు విచారణ కోసం అనంతరం తూ.గో.జిల్లాకు జగన్ ని హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్న ఆనం దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. కాగా, వైసీపీలో ఆనం చేరతారన్న వార్తల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో మంచి పట్టు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆనం చేరికతో అదనపు బలం చేకూరనుంది.