ఎన్నికల ముందు బీజేపీకి మరో ఎదురు దెబ్బ !

BJP MLA Ghanshyam Tiwari quits BJP party

దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న విషయం మరోసారి బహిర్గతం అయ్యింది. అందరికంటే ముందుగా మిత్రపక్షంగా ఉన్న శివసేన తిరుగుబాటు జెండా ఎగురవేసి బయటకి రాగా, ఆ వరుసలోనే మీత్రపక్షమయిన తెలుగుదేశం కూడా బిజెపి పై కాలు దువ్వటంతో అప్పటి వరకు అసంతృప్తితో ఉన్న మిత్రపక్షాలే కాక బిజెపి అధిష్టానం మొనార్కిజం భరించలేని సొంత పార్టీ నేతలు సైతం ఒక్కొక్కరుగా ఆ పార్టీ నుంచి బయటకి వస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్తాన్ లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత ఘనశ్యామ్ తివారి బీజేపీకి గుడ్ బై చెప్పారు. తన రాజనామా లేఖను జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమర్పించారు. అయితే రాజస్తాన్ సీఎం వసుంధరా రాజేతో ఆయనకు గత కొంతకాలంగా విభేదాలు ఏర్పడ్డాయని ఈ కారణంగానే ఆయన రాజీనామా చేశారని బీజేపీ వర్గాల సమాచారం. రాజీనామా చేసి బయటకి వచ్చిన ఆయన దేశంలో ఎమర్జెన్సీ వాతావరణం నాటి పరిస్థితులు సృష్టించారంటూ కలకలం రేకెత్తించే వ్యాఖ్యలు చేశారు.

5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘన్శ్యామ్ గత ఎన్నికల్లో(2013) రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారు. రాజస్తాన్ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఘన్ శ్యామ్ ప్రస్తుతం సంగానర్ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ముప్పై ఏళ్లుగా బిజెపిలో తిరుగులేని నేతగా పేరొందిన ఘనశ్యాం తివారి పార్టీకి గుడ్ బై చెప్పటం స్థానిక బిజెపి వర్గాలు జీర్నించుకోలేకపోతున్నాయి …ఆయన బాటలోనే పలువురు ఎమెల్యేలు ఆ పార్టీ వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఘన్ శ్యామ్ తనయుడు అఖిలేష్ ఇప్పటికే భారత్ వాహిని పార్టీ పేరుతో రాజకీయ ఫ్రంట్ ను ప్రారంభించారు. ఈ ఏడాది చివరలో జరగనున్న రాజస్తాన్ ఎన్నికల్లో 200 మంది అభ్యర్థులను బరిలో దింపేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఘన్ శ్యామ్ రాజీనామా చేయడం పైగా బీజేపీ పెద్దలను ప్రధానంగా సీఎంను టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. బీజేపీలోని తన సన్నిహితులను కూడా రాజీనామా చేయించి ఆ భారత్ వాహిని పార్టీ ద్వారా రంగంలోకి దింపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.