లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. వాటిలో మధ్యప్రదేశ్ కూడా ఒకటి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలను గెలుచుకుని మేజిక్ ఫిగర్‌కు రెండు స్థానాల దూరంలో నిలవడంతో బీఎస్పీ, ఎస్పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బీజేపీ వంద కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి, కాంగ్రెస్ ఎమ్మెల్యే బాజీనాథ్ కుశ్వాహను కలిశారని, అనంతరం ఆయనను ఓ దాబాకు తీసుకెళ్లి బీజేపీ సీనియర్ నేతలు నరోత్తమ్ మిశ్రా, విశ్వాస్ సారంగ్ మాట్లాడారన్నారు.. ఈ సందర్భంగా కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహాయం చేస్తే 100 కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆయనకు ఆశ చూపారని ఆరోపించారు. అలాగే తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి సైతం ఇస్తామని వారు ఆయనకు ఆశ చూపారని దిగ్విజయ్ ఆరోపించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఓటమిని జీర్ణించుకోలేక ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని దిగ్విజయ్ ఆరోపించారు. ఈ ఆరోపణలను మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు ఖండించారు. అబద్ధాలు ప్రచారం చేయడం దిగ్విజయ్ కి అలవాటేనని అని విమర్శించారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే తప్పకుండా విచారణ జరిపించాలని అన్నారు.