Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మున్ముందు సరికొత్త మలుపులు తిరగబోతున్నాయి. ఇప్పటిదాకా ఏపీ లో తోక పార్టీలుగానే వుండిపోయిన బీజేపీ , జనసేన లు ఇప్పుడు ప్రత్యక్షంగా కార్యక్షేత్రంలో బలం పెంచుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్రం లో అధికారం అండతో ఎలాగైనా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ శక్తిగా ఆవిర్భవించాలని బీజేపీ భావిస్తోంది. ఇదే లక్ష్యంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
వైసీపీ , జనసేన లు తమ అడుగులకి మడుగులు ఒత్తేలా చూడడంతో పాటు టీడీపీ స్పీడ్ కి గండి కొట్టేందుకు రామ్ మాధవ్ కొన్ని ప్రత్యేక వ్యూహాలతో ఆంధ్రప్రదేశ్ గడ్డ మీదకు అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు స్పీడ్ తట్టుకోవాలంటే ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు వ్యూహాలకి పదును పెట్టాలని బీజేపీ తో పాటు ఇప్పటికే రామ్ మాధవ్ కి కూడా అర్ధం అయివుంటుంది.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పార్టీ ఆవిర్భావ సభ తర్వాత తనపై పడిన బీజేపీ తొత్తు ముద్ర తొలగించుకోవాలని అనుకుంటున్నారు. అందుకు ప్రస్తుతం ఆయనకు వున్న ఒకే ఒక్క అవకాశం వామపక్షాలు. లెఫ్ట్ కి ఓట్లు వున్నా ,లేకున్నా వారితో కలిసి పనిచేయడం అన్న ముద్ర , బీజేపీ తో లోపాయికారీ ఒప్పందాలు వున్నాయన్న ఆరోపణలు ఎదుర్కోడానికి పనికి వస్తాయని పవన్ కి తెలుసు. అందుకే ప్రత్యేక హోదా కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో ఎర్ర జెండాలకూ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కవరింగ్ ఇవ్వడానికి ఇంకో సారి పవన్ విజయవాడ వస్తున్నారు.
ఏప్రిల్ 4 , 5 తేదీల్లో విజయవాడ వెళ్ళబోతున్న పవన్ అక్కడ వామపక్ష నేతలతో భేటీ అవడంలో అంతరార్ధం ఇదేనట. రామ్ మాధవ్ వ్యూహంలో చిక్కుకున్న పవన్ కి గానీ , పవన్ వ్యూహంలో ఇరుక్కుంటున్న వామపక్షాలకు గానీ తాము ఇంకొకరి ఆటలో పావులం అని ఎప్పుడు తెలుసుకుంటారో ?