Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యుద్ధం వచ్చేసినట్టే అని అంతర్జాతీయ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసిన ఉత్తర కొరియా, అమెరికా ఇప్పుడు కాస్త మెత్తపడ్డాయి. ఉత్తర కొరియా కాస్త వెనక్కి తగ్గి అమెరికాపై తలపెట్టిన క్షిపణి దాడిని విరమించుకోవటంతో ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారుతున్నాయి. చర్చలకు ఏ మాత్రం అవకాశం లేని పరిస్థితుల స్థానంలో సుహ్రుద్భావ వాతావరణం నెలకొనే స్థితి కనిపిస్తోంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించటమే ఇందుకు ఉదాహరణ. ఉత్తర కొరియా క్షిపణి దాడి విరమించుకున్న తర్వాత ట్రంప్ తొలిసారి స్పందించారు.
కిమ్ జాంగ్ ఉన్ తెలివైన, సరైన నిర్ణయం తీసుకున్నారని, క్షిపణి దాడి ఆలోచన విపత్కరమే గాక, ఆమోదయోగ్యమైనది కూడా కాదని ట్రంప్ ట్వీట్ చేశారు. అటు ఇప్పటికీ తాము ఉత్తరకొరియాతో చర్చలకు సిద్దంగానే ఉన్నామని అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్ సన్ చెప్పారు. అమెరికా భూభాగమైన గువాన్ పై క్షిపణి దాడి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని గత వారం ఉత్తరకొరియా ప్రకటించిన వెంటనే అంతర్జాతీయంగా పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉత్తర కొరియా ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాటు అనేక దేశాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఉత్తరకొరియా తన తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. ఆ రెండు దేశాల మధ్య ఇప్పుడు యుద్దం వస్తే…ఆ ప్రభావం వాటిపైనే కాదు..ఇతర దేశాలపైనా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అంత ఆశాజనకంగా లేని ప్రస్తుత తరుణంలో యుద్ధం భారీ నష్టాలనే మిగుల్చుతుంది.
దానికి తోడు భారత్, చైనా మద్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉత్తరకొరియాకు మిత్రపక్షంగా ఉంటున్న చైనా…మన దేశంతో యుద్ధం చేయటానికి ఉవ్విళ్లూరుతోంది కానీ…అమెరికాతో యుద్ధం విషయంలో ఉత్తరకొరియాకు మద్దతివ్వటానికి సిద్దంగా లేదు. ట్రంప్ తో చైనా నేతలు ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. మిత్ర దేశం చైనా మాట విందో లేక అమెరికా హెచ్చరికలకు తలొగ్గిందో తెలియదు కానీ…ఇప్పుడు మాత్రం ఉత్తర కొరియా క్షిపణి దాడి చేయాలన్న ఆలోచనను విరమించుకుంది. క్షిపణి దాడిని వాయిదా వేస్తున్నామని, అమెరికా మరిన్ని తప్పులు చేసేంతవరకు ఎదురుచూస్తామని ఉత్తర కొరియా మీడియా ప్రకటించింది. అమెరికా, ఉత్తరకొరియా మధ్య యుద్ధం ఆలోచన ముగిసిపోవటంతో ఆ రెండు దేశాల పౌరులతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఊపిరిపీల్చుకున్నాయి.
మరిన్ని వార్తలు: