Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కాలా’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. దాదాపు ఆరు నెలలుగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రంను ఎట్టకేలకు రేపు విడుదల చేయబోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను ధనుష్ నిర్మించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇక ఈ చిత్రం విడుదలకు కర్ణాటకలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కావేరి నదీ జలాల విషయంలో తమిళనాడు, కర్ణాటక ప్రజల మద్య చిన్నపాటి యుద్దం జరుగుతుంది. ఆ కారణంగానే సినిమాను కర్ణాటకలో విడుదల కానిచ్చేది లేదు అంటూ అక్కడి ప్రజలు చెబుతున్నారు. అయితే కాలా చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం కోర్టుకు వెళ్లారు. కోర్టు కర్ణాటక ప్రభుత్వంను కాలా థియేటర్లకు భద్రత కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
కోర్టు ఆదేశంతో ‘కాలా’ చిత్రం విడుదలవుతున్న ప్రతి థియేటర్లలో కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచక జరిగి పోతున్నాయి. మరో వైపు సీఎం కుమార స్వామి ఈ సమయంలో ‘కాలా’ చిత్రాన్ని విడుదల చేయక పోవడం మంచిది అంటూ చిత్ర యూనిట్ సభ్యులను హెచ్చరిస్తున్నాడు. కర్ణాటకలో పరిస్థితులు ఆశాజనకంగా లేవు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజా సంఘాల వారు కాలాను ప్రదర్శింపడానికి ఒప్పుకోవడం లేదు. అదే జరిగితే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని, అందుకే సినిమాను కర్ణాటకలో విడుదల చేయాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలంటూ సూచిస్తున్నారు. ఒక వైపు భద్రత కల్పిస్తాం అంటూనే మరో వైపు ఇలాంటి షాకింగ్ వ్యాఖ్యలు చేయడం ఏంటని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. సినిమా విడుదలకు కుమార స్వామి ఏ మేరకు సహకరిస్తాడు అనేది అనుమానమే.