వైఎస్ జగన్ అధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ తొలిసమావేశం నేడు జరగబోతోంది. సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ భేటీలో ప్రధానంగా 8 కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుని ఆమోదించబోతున్నారు. ముఖ్యంగా వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టో హామీలు, నవరత్నాలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. మొదటి అంశంగా పెన్షన్ను రూ.2000 నుంచి రూ.2250కు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించబోతున్నారు. రెండో అంశంగా ఆశా వర్కర్ల వేతనాలను రూ.3000 నుంచీ రూ.10,000కు పెంచడాన్ని ఆమోదిస్తారు. ఆ తర్వాత, RTCని ప్రభుత్వంలో విలీనం చెయ్యడం, మున్సిపల్ శానిటరీ వర్కర్ల వేతనాలు పెంపు, ఉద్యోగులకు 27 శాతం IR, రైతు బంధు పథకం, హోంగార్డుల వేతనాల పెంపు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.ఈ ఏడాది అక్టోబరు 15 నుంచీ రైతు భరోసా పథకాన్ని అమలుచేస్తానన్న జగన్ కేబినెట్లో దీనిపై కీలకంగా చర్చించబోతున్నారు. నవరత్నాల్లో భాగంగా జగన్ 2020 మే నుంచీ రైతు భరోసా పథకం ద్వారా ఏటా మే నెలలో పెట్టుబడి కింద రైతులకు రూ.12,500 ఇస్తానని హామీ ఇచ్చారు. ఐతే… గత ప్రభుత్వం ఇస్తున్న అన్నదాత సుఖీభవను రద్దుచేసిన జగన్ ఈ ఏడాది రబీ సీజన్ నుంచే రైతు భరోసాను అమల్లోకి తెస్తామని తెలిపారు. ఈ విషయంపైనా కేబినెట్లో చర్చించి ఆమోదించనున్నారు.