Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చండీగఢ్ లో ఐఏఎస్ అధికారి కుమార్తె వాహనాన్ని వెంబడించి, వేధించిన కేసులో వికాస్ బరాలా నేరాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మూడు గంటల పాటు సాగిన విచారణ అనంతరం వికాస్ బరాలా నేరాన్ని అంగీకరించాడని పోలీసు వర్గాలు చెప్పాయి. హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా కుమారుడైన వికాస్ కు వ్యతిరేకంగా ఈ కేసులో అన్నిసాక్ష్యాలున్నట్టు సమాచారం. నేరం రుజువైతే వికాస్ కు ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. వికాస్, అతని స్నేహితులతో కలిసి తనను వెంబడించి, అపహరించేందుకు ప్రయత్నించారని ఐఏఎస్ అధికారి కుమార్తె వర్ణిక ఇటీవల ఫేస్ బుక్ లో పోస్ట్ ఛేశారు.
హర్యానాతో పాటు దేశవ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది. ఈ కేసులో గత శనివారం వికాస్, అతని స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే అదే రోజు వాళ్లు బెయిల్ పై విడుదలవ్వటంతో హర్యానా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. కేసు వివాదాస్పదంగా మారటంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఐదు సిసిటీవీ ఫుటేజ్ లను పరిశీలించి వికాస్ కు సమన్లు జారీ చేసి అరెస్టు చేశారు. అతనిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
మరోవైపు ఈ కేసు విచారణలో వికాస్ బరాలా తండ్రి సుభాష్ బరాలా జోక్యం చేసుకుంటున్నారని, పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. బాధితురాలు తనకు కుమార్తె వంటిదని, తాను కేసులో ఎలాంటి జోక్యం చేసుకోవట్లేదని చెప్పారు. దీనిపై వర్ణిక తండ్రి, ఐఏఎస్ అధికారి వీరేంద్ర కుందూ స్పందించారు. తన కుమార్తెకు ఆయన తండ్రి అని భావిస్తే…తండ్రి లానే ప్రవర్తించాలని హితవు పలికారు. హర్యానాలో ప్రాచుర్యంలో ఉన్న ఓ సూక్తి ప్రకారం కుమార్తెలను, ఆడపిల్లలను రక్షించే బాద్యత ప్రతిఒక్కరిపై ఉందని, సుభాష్ బరాలా తండ్రి లానే ప్రవర్తించాలని సూచించారు.
పోలీసులు అరెస్టుచేసి తీసుకెళ్తున్నప్పడు వికాస్ తన ముఖం కనపడకుండా కవర్ చేసుకున్నాడని, బాధితురాలైన తన కుమార్తె మాత్రం అందరికీ తన ముఖాన్ని చూపించిందని, ధైర్యం అంటే..మార్పంటే ఇదే అని వీరేశ్ కుందూ వర్ణికను ప్రశంసించారు. కేసులో మొదటి నుంచీ వర్ణిక ఎంతో ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రాత్రిళ్లు ఆడపిల్లలకు బయట ఏం పని అని ప్రశ్నిస్తున్న వారికి ఆమె దీటుగా సమాధానం ఇస్తున్నారు. ఈ కేసులో తాను బాధితురాలినే కానీ నిందితురాలిని కాదని ఆమె బదులిస్తున్నారు. అటు ఈ వ్యవహారంతో బీజేపీకి జాతీయ స్థాయిలో చెడ్డపేరు రావటంతోకేసులో ఎలాంటి జోక్యం చేసుకోకూడదని సుభాష్ బరాలాను జాతీయ నాయకత్వం ఆదశించినట్టు సమాచారం.
మరిన్ని వార్తలు:
క్విట్ ఇండియా… క్విట్ ఏపీ
జగన్ కామెంట్స్ తో కామెడీ…శిల్పాకి మాత్రం టెర్రర్.