హీరో రామ్ గత చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో తాజాగా నటించిన ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. దసరా కానుకగా రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రంకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించడంతో అంచనాలు పెరిగాయి. ఇప్పటి వరకు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యి మంచి వసూళ్లు సాధించాయి. దిల్‌రాజు మంచి కథలతో సినిమాలు చేస్తాడనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని ఏకంగా 25 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా సినీ వర్గాల నుండి విశ్వసనీయ సమాచారం అందుతోంది. కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంను 25 కోట్లకు దిల్‌రాజు అమ్మేసి విడుదలకు ముందే లాభాలను తన ఖాతాలో వేసుకుని, రామ్ పై పెద్ద బండ పెట్టినట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్న మాట వాస్తవమే. కాని 25 కోట్ల బిజినెస్ అనేది రామ్ స్థాయికి మరీ ఎక్కువ అని, ఒకవేళ సినిమా ఫలితం తారుమారు అయితే డిస్ట్రిబ్యూటర్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అది రామ్‌కు అప్రదిష్టగా మారుతుందని, డిజాస్టర్ ను చవిచూడాల్సి వస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ యావరేజ్ టాక్‌ను దక్కించుకున్నా కూడా 25 కోట్లను రికవరీ చేయడం కష్టమే. అప్పుడు కూడా రామ్‌కే నష్టం. మంచి టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్‌ను రాబట్టడంలో రామ్ విఫలం అయ్యాడని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి దిల్‌రాజు ఆశతో రామ్ నెత్తిపై పెద్ద భారం మోపారు.