Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా ఉద్యమం పక్కదారి పట్టించేందుకే కేంద్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం అంశం లేవనెత్తిందని ప్రత్యేక హోదా విభజన హక్కుల సాధన సమితి వ్యవస్థాపకుడు శివాజీ ఆరోపించారు. రాష్ట్రంలోని ఐదుకోట్ల మంది ప్రజలు తిరుమలను కాపాడుకుంటారని శివాజీ ధీమా వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా కోసం ఈ నెల 10వ తేదీన జాగారం కార్యక్రమం చేపడతానని శివాజీ ప్రకటించారు. పదో తేదీ రాత్రి 7గంటల నుంచి, 11వతేదీ ఉదయం 7గంటల వరకు జాగరణ చేయనున్నట్టు ఆయన చెప్పారు. తన పోరాటానికి అందరూ మద్దతివ్వాలని, బీజేపీ నేతలకు జాగారం సెగ తగులుతుందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్రంలో ఏమీ చేయలేమని, హోదా సాధించలేనప్పుడు మనం తెలుగువాళ్లగా ఉండడం వృథా అని శివాజీ వ్యాఖ్యానించారు.
ఏపీలోని అన్ని పార్టీలకు చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే కర్నాటకలో బీజేపీని ఓడించాలని పిలుపునివ్వాలని, అప్పుడే ప్రజలు ఆ పార్టీలను నమ్ముతారని అన్నారు. ఏపీలో కొత్త అలజడులు సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రస్తుత నేతలకు కుర్చీపై కాంక్ష పెరిగిపోయిందని, బతికినన్నన్నిరోజులు ప్రధానమంత్రిగా ఉండాలని నేతలు ఆలోచించడం దేశానికే తీవ్ర నష్టం చేకూరుస్తుందని హెచ్చరించారు. దేశంలో కులాల మధ్య చిచ్చుపెట్టి అంతర్గత కలహాలు సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని శివాజీ ఆరోపించారు.