Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జగన్ డిశ్చార్జ్ పిటిషన్ విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది. జగతి పబ్లికేషన్స్ లో ముగ్గురు వ్యాపారుల పెట్టుబడులకు సంబంధించిన ఛార్జిషీట్ లో జగన్ ఈ పిటిషన్ వేశారు. కేసు నుంచి తనను తొలగించాలని జగన్ కోరారు. జగన్ పిటిషన్ కొట్టివేయాలని ఇప్పటికే సీబీఐ కౌంటర్ దాఖలుచేసింది. దీనిపై సుదీర్ఘ వాదనల అనంతరం విచారణను సీబీఐ కోర్డు 22కు వాయిదా వేసింది. జగన్ తరపున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వరావు వాదనలు వినిపించారు. పెట్టుబడుల వ్యవహారంలో క్విడ్ ప్రోకో గానీ, ప్రజా ప్రయోజనాలు గాని ఏమీ లేవని, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిందని ఆయన వాదించారు.
పెట్టుబడుల వ్యవహారం పూర్తిగా కంపెనీ చట్టం పరిధిలోని వ్యాపార సంబంధిత అంశమని తెలిపారు. అక్రమాస్తుల కేసు విచారణకు జగన్, విజయ్ సాయిరెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జగన్ కోర్టు హాలులోనే ఉన్నారు. మరోవైపు లండన్ వెళ్లేందుకు అనుమతించాలని జగన్ వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు సానుకూలంగా స్పందించింది. కుమార్తెను లండన్ లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీలో చేర్చేందుకు లండన్ వెళ్లాలని, అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. దీనికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇటీవలే ఆయన కోర్టు అనుమతితో న్యూజిలాండ్ వెళ్లివచ్చారు.
మరిన్ని వార్తలు: