Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమకు ఏది కావాలో, ఏది చేయాలో స్పష్టత లేనప్పుడు ఏదో ఒకటి చేస్తుంటాం. లక్ష్యం తెలిసి దాన్ని అందుకునే దారి ఇది అని కచ్చితంగా తెలియనప్పుడు అటుఇటు నడిచేస్తుంటాం. ఇప్పుడు వైసీపీ పద్ధతి కూడా అలాగే వుంది. ఆ పార్టీ , దాని అధ్యక్షుడు జగన్ ముందు ఇప్పుడున్న ఏకైక లక్ష్యం 2019 ఎన్నికల్లో గెలుపు. దాని కోసం ఏమి చేయడానికైనా సిద్ధం. కానీ ఏది చేస్తే ఆ గెలుపు వస్తుందో తెలియకే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి దింపారు. అయినా ఆ పార్టీలో స్పష్టత రాలేదనడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి.
ఓ వైపు టీడీపీ, బీజేపీ కూటమిని ఎదుర్కోడానికి సిద్ధపడుతున్న వైసీపీ విపక్ష ఓటు చీలకుండా చూసేందుకు జనసేన, లెఫ్ట్ పార్టీలకు స్నేహ హస్తం చాటాలి అనుకుంటోంది. లెఫ్ట్, జనసేన, లోక్ సత్తా లతో ఏర్పడబోయే కూటమిలో తాము కూడా చేరుతామని ఓ వైపు ఆ కూటమి నేతలతో సంప్రదింపులు జరుపుతూనే వున్నారు. ప్రశాంత్ కిషోర్ ఏకంగా ఇదే ప్రతిపాదనతో పవన్ ని కలవడానికి ఓ లేఖ కూడా రాసినట్టు సమాచారం. పైగా పవన్ ఒప్పుకుంటే జగన్ స్వయంగా వచ్చి కలుస్తాడని కూడా ప్రశాంత్ జనసేన కార్యాలయానికి సమాచారం అందించారట. ఈ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారంటే విపక్ష కూటమి ఏర్పాటుకు జగన్ సుముఖంగా ఉన్నట్టు అనిపిస్తోంది. అయితే ఇంకోవైపు బీజేపీ తో పొత్తుకు కూడా ఆ పార్టీ లోపాయికారీ ప్రయత్నాలు సాగిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్ని అడ్డంపెట్టుకుని బీజేపీ గుడ్ లుక్స్ లో పడడానికి జగన్ ఏ స్థాయిలో తాపత్రయపడ్డారో అందరూ చూస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి ఓ ప్రతిపాదన వచ్చినప్పుడు ఇదే జగన్ ” మీతో కలిస్తే మాకు గట్టి వోట్ బ్యాంకు గా ఉన్న ఎస్సీ, మైనారిటీ ల్లో వ్యతిరేకత వస్తుంది” అని చెప్పారు. ఇప్పుడు బీజేపీ తో చెలిమి కోసం ఆ వర్గాల్ని వదులుకోడానికి కూడా సిద్ధపడి ఆ పార్టీకి సాగిలపడిపోతున్నారు. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ టీడీపీ ని వదులుకుంటే బీజేపీ తో కలిసే ఆలోచన చేస్తాం అని ప్రకటన ఇవ్వడం ఆషామాషీగా జరిగింది కాదు. వైసీపీ మనసులో మాటనే ఆయన బయటపెట్టారు. అయితే ఇలా అధికారమే పరమావధిగా రెండు పడవల మీద కాళ్ళు పెట్టి వైసీపీ చేస్తున్న రాజకీయ ప్రయాణం సేఫ్ కాదనిపిస్తోంది.
మరిన్ని వార్తలు