బీజేపీలో చేరాల్సిందిగా ఆ పార్టీ నేతలు తనను ఆహ్వానించారని టీడీపీ నేత, మాజీ లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ విషయంలో తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నీతిఆయోగ్ సమావేశం నేపథ్యంలో ఢిల్లీలో పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ చాలా హుందాగా ప్రవర్తించారని జేసీ కితాబిచ్చారు. పులివెందుల నుంచి వచ్చిన జగన్ ఇలా ఉంటాడని తాము అనుకోలేదని అన్నారు. సీఎం జగన్ పాలన పనితీరు ఎలా ఉందో తనకు తెలియదని కానీ నీతి ఆయోగ్ సమావేశం నేపదంలో ఢిల్లీ పర్యటనలో జగన్ చాలా హుందాగా వ్యవహరించాడని జేసీ కితాబిచ్చారు. ‘అంతమంది ఉన్న మోదీ సైన్యంతో నేను తలపడలేను అన్న వాస్తవాన్ని గ్రహించి మాట్లాడాడని అన్నారు. జగన్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసనీ, అతనిది ఉద్రేకంతో కూడిన స్వభావమని, ఒకడు చెబితే ఆయన వినిపించుకోరని కానీ అభిప్రాయాలు అన్నాక మారుతాయనీ, బతికినంతకాలం ఒకే అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జగన్ కు భయపడి ఆయన్ను పొగడటం లేదనీ, ఆయన తీరు నచ్చే ప్రశంసిస్తున్నానని జేసీ అన్నారు. తాను జగన్ కు భయపడుతున్నానో, లేదో 6 నెలల తర్వాత చూస్తారని వ్యాఖ్యానించారు.