గణేశ్ నిమజ్జనం సందర్భంగా మూడు రోజుల క్రితం అనంతపురం జిల్లాలోని ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకులు, చిన్నపొడమల, పెద్దపొడమల గ్రామస్తుల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ గొడవలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో గ్రామస్తులకు మద్దతుగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ధర్నాకు దిగడంతో టీడీపీ కార్యకర్తలు, పోలీసు బలగాలు భారిగా చేరుకున్నాయి. సోమవారం నాడు ఆశ్రమ నిర్వాహకులతో చర్చించిన జిల్లా కలెక్టర్ ఆధార్ కార్డు ఉన్నవారిని మాత్రమే ఆశ్రమంలో ఉండేందుకు అనుమతించారు. దీంతో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన ఆందోళనను విరమించారు. ఈ వ్యవహారంపై సీఎంతో చర్చించేందుకు జేసీ ఈరోజు అమరావతికి వచ్చారు.
దాదాపు అరగంటపాటూ సీఎంతో తాడిపత్రి గొడవ సహా పలుకీలక అంశాలపై చర్చించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రబోధానంద ఆశ్రమ చరిత్ర మొత్తం తనకు తెలుసన్నారు. అలాగే ప్రబోధానంద వ్యవహారంలో తాను గెలిచానో ఓడానో మీడియానే తేల్చాలని చెప్పిన ఆయన ప్రబోధానందతో పెట్టుకొంటే నియోజకవర్గంలో ఇబ్బందులుంటాయని కామెంట్లు చేసే వారిలో గెలిచే వారెవ్వరూ లేరని వ్యాఖ్యానించారు. ప్రబోధానంద స్వామీజీకి బాధితులు చాలామంది ఉన్నారని.. త్వరలోనే కొన్ని వీడియోలను విడుదల చేస్తానని దివాకర్‌రెడ్డి అన్నారు.