ఎప్పుడూ పవన్ ఫ్యాన్స్ పై విరుచుకుపడే సినీవిమర్శకుడు కత్తిమహేశ్ అజ్ఞాతవాసి విడుదల నేపథ్యంలో ఆయనకు ఓ ఉచిత సలహా ఇచ్చాడు. అజ్ఞాతవాసి తనను తీవ్రంగా నిరాశపర్చిందని రివ్యూ ఇచ్చిన కత్తిమహేశ్ ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి వెళ్లబోయే ముందు పవన్ ఓ మంచి సినిమా చేయాలని తాను కోరుకుంటున్నానన్నాడు. అజ్ఞాతవాసికి తాను ఇచ్చిన రివ్యూ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ సినిమా తనను చాలా నిరుత్సాహపరిచిందని చెప్పాడు. నిజానికి ఈ సినిమా టీజర్ చూసినప్పుడు తాను ఇంప్రెస్ కాలేదని, ట్రైలర్ చూశాక మాత్రం ఏదో ఉంటుందని భావించానని చెప్పుకొచ్చాడు. అన్ని విషయాలను పక్కన బెట్టి సినిమాను సినిమాగా చూద్దామని వెళ్లానన్నాడు. స్క్రీన్ పై ఈ సినిమాను ఎలా చూపించారనే పెద్ద ఆసక్తితో వెళ్తే..త్రివిక్రమ్, పవన్ ఇద్దరూ తనను నిరుత్సాహపరిచారని కత్తి మహేశ్ వ్యాఖ్యానించాడు .
అజ్ఞాతవాసి ఇటాలియన్ లేదా ఫ్రెంచ్ సినిమా కాపీ అని అందరికీ తెలుసని, కథ మాత్రం అక్కడి నుంచే తీసుకుని, నాలుగు కామెడీ సీన్లు, చౌకబారు రొమాంటిక్ సీక్వెన్స్ కలిపి తెలుగు ప్రేక్షకులకు ఇది సరిపోతుందిలే అన్నట్టు ట్రీట్మెంట్ ఇచ్చారని విమర్శించాడు. ఇలా కావాలని చేయకపోయినప్పటికీ…కథకు న్యాయం చేయకపోగా, నాశనం చేస్తే మాత్రం ఎవరూ ప్రశంసించరని అన్నాడు. సీరియస్ కథకు కామెడీ ట్రీట్ మెంట్ ఇవ్వడంతో ఈ సినిమా అపహాస్యం పాలయిందని విశ్లేషించాడు. అయితే సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయని, సరదాగా పాడిన కొడకా కోటేశ్వర్రావు పాట తప్ప, మిగిలిన అన్ని పాటలూ తనకు నచ్చాయని, ఆ పాటల్లో చాలా బలమైన అర్ధాలు కనిపించాయని కత్తి మహేశ్ తన రివ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన రివ్యూ సంగతి పక్కనపెడితే అజ్ఞాతవాసి రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. అమెరికాలో అజ్ఞాతవాసి బాహుబలి ది బిగినింగ్, ఖైదీ నెంబర్ 150 రికార్డులను బ్రేక్ చేసింది. ప్రీమియర్ షోల ద్వారా అజ్ఞాతవాసి దాదాపు 1.40 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అమెరికా ప్రీమియర్ షోలలో బాహుబలిః ది బిగినింగ్ కు 1,005,630 డాలర్లు, 1,295,613 డాలర్లు వసూలు చేయగా, 1,464,647 డాలర్ల వసూలుతో అజ్ఞాతవాసి వాటిని బీట్ చేసింది.