ఏపీ లోక్‌సభ స్థానాలకు సంబంధించి టైమ్స్ నౌ-వీఎంఆర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ఉంటుందని ఈ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంటరీ స్థానాలకు గానూ వైఎస్‌ఆర్సీపీ 23 సీట్లను గెలుచుకుంటుందని టైమ్స్ నౌ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. అధికార టీడీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాతా తెరిచే ఛాన్స్ లేదని తెలిపింది. 2014లో టీడీపీ 15 స్థానాలను సొంతం చేసుకోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలను, బీజేపీ రెండు సీట్లను గెలుచుకున్నాయి. లోక్ సభ ఎన్నికల తర్వాత జగన్ కేంద్రంలో చక్రం తిప్పుతారని ఈ ఒపీనియన్ పోల్ అభిప్రాయపడింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ 16 స్థానాలు గెలుచుకోవాలని చూస్తుండగా ఆ పార్టీకి 10 స్థానాలు వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ-వీఎంఆర్ ఒపీనియన్ పోల్‌లో అభిప్రాయపడింది. కాంగ్రెస్ 5, బీజేపీ 1, ఇతరులు ఒక స్థానం చొప్పున గెలవొచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం టీఆర్ఎస్ కు 12 మంది ఎంపీలుండ కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎంపీలున్నారు.
అలాగే 431 లోక్‌సభ స్థానాల్లో టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే చేయగా ఎన్డీయేకు 184 స్థానాలు, యూపీఏకు 109 సీట్లు దక్కే అవకాశం ఉందని తేలింది. ఇతరులు 138 చోట్ల గెలుపొందుతారని సర్వే అంచనా వేసింది. ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం దక్షిణాదిలో యూపీఏ 66 స్థానాలను గెలుచుకోనుంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లు కాంగ్రెస్‌కు బూస్ట్ ఇవ్వనున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో యూపీఏ 2 స్థానాలకు మాత్రమే పరిమితం కానుండగా.. ఎన్డీయే 27, ఎస్పీ-బీఎస్పీ కూటమి 51 స్థానాలను గెలుచుకోనుందని సర్వే అంచనా వేసింది. గత ఎన్నికల్లో బీజేపీ యూపీలో 73 స్థానాలను గెలుచుకుంది. యూపీలో వాటిల్లిన నష్టాన్ని మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో బీజేపీ పూడ్చుకునే అవకాశం ఉంది. కానీ దక్షిణాదిలో కర్ణాటకలో మాత్రమే ఆ పార్టీకి అనుకూల పరిస్థితులున్నాయి. ఈ సర్వే అంచనాల ప్రకారం ఎన్డీయే మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలవనుంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో మమతా బెనర్జీ, మాయవతి, జగన్, కేసీఆర్ లాంటి వాళ్ళు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి.