టాలీవుడ్ టాప్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ చిత్రం టీజర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రంలో మహేష్‌బాబు సీఎంగా కనిపించబోతున్నాడు. రాజకీయ నాయకుడు అనేవాడు ఇచ్చిన మాట తప్పకూడదని, అలా తప్పితే మనిషి అవ్వడు అంటూ ఆ టీజర్లో మహేష్‌బాబు డైలాగ్ ఉంది. అదే డైలాగ్‌ను ప్రధాని నరేంద్ర మోడీకి వర్తించేలా కొరటాల శివ చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎన్నికల సమయంలో ప్రధాని ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదా హామీ ఇచ్చి తప్పాడు అని, ఆయన హామీని గుర్తు చేసి, హామీని నిలుపుకుని మోడీని మనిషిగా మారుద్దాం అంటూ కొరటాల చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. పలువురు కొరటాల శివ ట్వీట్‌కు ప్రశంసలు కురిపించారు. కాని మోడీ మద్దతుదారులు మాత్రం కొరటాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన ట్వీట్‌కు వస్తున్న రెస్పాన్స్‌పై కొరటాల స్పందించాడు. తాను రాజకీయ ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఏపీ ప్రజల తరపున, ఒక కామన్ మ్యాన్‌గా తాను ఆ వ్యాఖ్యలను చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. తన వ్యాఖ్యల వెనుక రాజకీయ ఉద్దేశ్యం లేదు కనుక, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా కొరటాల చెప్పుకొచ్చాడు. మోడీ ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వరకు కామన్ మాన్‌గా పోరాటం చేస్తాను అంటూ కొరటాల మరోసారి చెప్పడంతో ఆయన్ను అంతా కూడా అభినందిస్తున్నారు. కొరటాల శివ ఏపీ ప్రజల ప్రత్యేక హోదా కోసం స్పందించడం అభినందనీయం అంటూ రాజకీయ వర్గాల వారు కూడా మెచ్చుకుంటున్నారు. బీజేపీ నాయకులు మాత్రం తన ‘భరత్ అను నేను’ చిత్రం ప్రమోషన్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా విమర్శలు గుప్పిస్తున్నారు.