తమ సభలు, ర్యాలీలకి వచ్చే జనానికి బిర్యానీ పొట్లాలు, మందు సీసాలు అందించడం రాజకీయ నాయకులకి కొత్తేమీ కాదు. కానీ దేవాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆహారంతో పాటు మద్యం బాటిళ్లను స్థానిక బీజేపీ నేత పంపిణీ చేయడంతో యూపీలో కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ లోని శ్రావణదేవి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ నేత నితిన్ అగర్వాల్ ఆధ్వర్యంలో శ్రవణ ఆలయంలో ‘పాసి సమ్మేళన్’ జరిగింది. ఆయన ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీని వీడి కమలం పంచన చేరారు. పార్టీ మారిన సందర్భంగా తన అభిమానులు, అనుచరులు, పార్టీ నేతలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఈ ప్యాకెట్లు తెరిస్తే అందులో ఆహారంతోపాటు మద్యం బాటిళ్లు కూడా ఉండడంతో కొందరు షాకయ్యారు. ముఖ్యంగా పిల్లలకు పంచిపెట్టిన ప్యాకెట్లలోనూ ఇవి దర్శనమివ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి. పైగా గ్రామంలోని తమ వర్గం వారికి ఈ ప్యాకెట్లను తప్పక పంపిణీ చేయాలని నితిన్ చెబుతున్నట్లున్న వీడియో ఒకటి బయటపడడం మరింత వివాదానికి కారణమైంది. ఈ ఘటనపై స్థానిక ఎంపీ తీవ్రంగా స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు బీజేపీ నాయకులు పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసేవారని, ఇలా మద్యం పంపిణీ చేయడం ఏమిటని ? బీజేపీపై దుష్ప్రచారం జరగాలన్న ఉద్దేశంతోనే నితిన్ తండ్రి నరేష్ అగర్వాల్ ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు.