Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక రాజకీయం నిముష నిముషానికి అనేక ములుపు తిరుగుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే, ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీరాములు సైతం ఇప్పటి వరకు తాను ప్రాతినిధ్యం వహించిన లోక్ సభ స్థానానికి రాజీనామా సమర్పించారు. వీరిద్దరి రాజీనామాలను లోక్ సభ స్పీకర్ ఆమోదించడం కూడా పూర్తయింది. అయితే వారి రాజీనామాలు వెంటనే ఆమోదించడం ఇప్పుడు తెలుగు రాజాకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
ఎందుకంటే ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైసీపీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు రాజీనామా చేసి ఢిల్లీలోని ఏపీ భవన్ లో సుమారు వారం రోజులపాటు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. అయితే వారు రాజీనాలు చేసినా ఇప్పటి వరకు ఆమోదించని విషయం మీద విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీజీపీ వైసీపీ లాలూచీ పడ్డాయని పలువురు విమర్శిస్తున్న నేపధ్యంలో వారి రాజీనామాల మీద ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే స్పీకర్ త్వరలో ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.
దీంతో మరోసారి ఏపీలో ఉప ఎన్నికలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇక ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కేబినెట్ సమావేశంలో చర్చించారని ఆయన దృష్టికి వచ్చింది అంటే కచ్చితంగా ఉప ఎన్నికలు జరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు కేవలం పది నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఉప ఎన్నికలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ ఐదు స్థానాల్లో ఎన్నికలు జరిగితే వాటి ఫలితాల ప్రభావం కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పడనుంది. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుంది అనే ఆసక్తి టీడీపీ-వైసీపీ వర్గాల్లో నెలకొంది.