Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు సినీ విమర్శకుడు మహేశ్ కత్తి. వారిని బహిరంగ చర్చకు రావల్సిందిగా సవాల్ విసిరిన కత్తి…ముందు చెప్పినట్టుగానే ఈ ఉదయం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చాడు. తన సొంత కారులో కాకుండా…ఓలా క్యాబ్ బుక్ చేసుకుని ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చారు కత్తి. అయితే పవన్ గానీ, పూనమ్ కానీ అక్కడకు రాకపోవడంతో…కాసేపు వేచి చూసిన మహేశ్ తర్వాత మీడియాతో మాట్లాడారు. పవన్ కు, ఆయన అభిమానులకు, పూనమ్ కు ఆరు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదని, తాను పది ప్రశ్నలు వేస్తే, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ పైనా, ఆయన ఫ్యాన్స్ పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తన తల్లిని, భార్యను నోటితో చెప్పలేని విధంగా బూతులు తిడుతోంటే తాను చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. తన అభిమానులను కూడా నియంత్రించుకోలేని స్థితిలో పవన్ కళ్యాన్ ఉన్నాడని ఆరోపించారు. తనను సామాజిక బహిష్కరణ చేయాలని కోన వెంకట్ డిమాండ్ చేశారని, ఓ దళితుడిగా తాను ఎన్నోసార్లు సామాజిక బహిష్కరణను చూశానని, సినీ ఇండస్ట్రీ నుంచి కూడా బహిష్కరించారని ఆవేదన వ్యక్తంచేశారు. రేణుదేశాయ్ తన రెండో వివాహం గురించి ఒక్క మాట ప్రస్తావిస్తే పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారని, ఆమె పెళ్లిచేసుకున్న వ్యక్తిని చంపేస్తామని హెచ్చరించారని గుర్తు చేసిన కత్తి..కనీసం పవన్ తన అభిమానుల వ్యాఖ్యలను ఖండించనైనా లేదని విమర్శించారు. ప్రశ్నిస్తానని, ప్రజలకు అండగా ఉంటానని చెప్పే పవన్ తన అభిమానులను ఎంతమాత్రమూ కంట్రోల్ చేయలేకపోతున్నారని, ఇక ఆయన ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. తాను ఓ మామూలు మనిషినని, తనపై అభిమానులు చేస్తున్న విమర్శల దాడిని ఒక్క మాట చెప్పి పవన్ అడ్డుకోలేకపోతున్నారని ఆరోపించారు. తాను పవన్ పై ఎప్పడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదని, రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే చేశానని, వాటికి సమాధానం చెప్పలేని ఆయన రాష్ట్రానికి ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు.
తన ప్రాణాలకు అపాయం ఉందని, ఈ వివాదానికి ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తే తనతో చర్చించేందుకు ఎవరూ రాలేదన్నారు. ఈ సందర్భంగా పవన్ కు మద్దతుగా తనను విమర్శించిన పూనమ్ కౌర్ కు కత్తి మహేశ్ కొన్ని ప్రశ్నలు సంధించారు. పూనమ్ కౌర్ ను తాను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టాలని భావించడం లేదని, అయితే ఆమె ముందు తాను కొన్ని ప్రశ్నలను ఉంచుతున్నానని అన్నారు. మీకు బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది? తిరుమలలో పవన్ కళ్యాణ్ తో పాటు దేవుడిముందు నిలబడి ఒకే గోత్రనామాలతో పూజ ఎందుకు చేయించుకున్నారో చెప్పగలరా..? పవన్ మోసం చేశాడన్న భావనతో మీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీకు అప్పుడు హాస్పిటల్లో చికిత్సకు ఎంత ఖర్చయింది? ఆ బిల్ కట్టిందెవరు? పవన్ కళ్యాణ్ మీ అమ్మకు ఏం ప్రామిస్ చేశారు? అది నెరవేర్చారా..? లేదా..? డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకంత కోపం? ఓ క్షుద్రమాంత్రికుడితో కలిసి త్రివిక్రమ్ పూజలు చేస్తోంటే, అక్కడ మీరు ఏం చేశారు? ఈ ప్రశ్నలకు పూనమ్ సమాధానం చెప్పాలని కత్తి డిమాండ్ చేశారు. తాను సంధించిన ప్రశ్నలకు సంబంధించి అన్ని ఆధారాలూ తన వద్ద ఉన్నాయన్నారు. అనంతరం ఓ చానల్ తో మాట్లాడుతూ తన ఆరోపణలను సమర్థించుకున్నారు కత్తి మహేశ్. పవన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్షుద్రపూజలు చేసినట్టు తన వద్ద వీడియో సాక్ష్యం ఉందని, సమయం వచ్చినప్పుడు దాన్ని బయటపెడతానని ఆయన చెప్పారు. ఆ పూజలు చేసిన పూజారి పేరు నరసింహ అని కూడా తెలిపారు. పవన్, త్రివిక్రమ్ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శనీయంగా మారుతుండడం చాలా ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.