భార్యతో గొడవపడి ఓ వ్యక్తి ఆ కోపం తీర్చుకోడానికి 148 ప్రయాణిస్తున్న ఓ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే 148 మంది ప్రయాణికులతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి దుబాయ్ వెళ్తున్న బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్ విమానాన్ని మార్గమధ్యంలో దారి మళ్లించేందుకు ప్రయత్నించాడో వ్యక్తి. ఢాకాలోని ఛత్రోగ్రామ్ లేదా చిట్టాగ్యాంగ్ విమానాశ్రయం నుంచి విమానం బయల్దేరిన కాసేపటికే ప్రయాణికుల్లోని ఓ వ్యక్తి లేచి తన వద్ద పిస్తోలు, పేలుడు పదార్థాలు ఉన్నాయని బెదిరిస్తూ కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు.
అయితే అక్కడి పైలెట్ మీ డిమాండ్ ఎంటనీ అడగగా నాకు నాభార్యతో గొడవలున్నాయని, ఈ విషయం మీద బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో వెంటనే మాట్లాడాలని హైజాకర్ పదేపదే డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని ఛత్రోగ్రామ్ (చిట్టాగ్యాంగ్) ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించేశారు. ఆ తర్వాత అక్కడ హైజాకర్‌తో అధికారులు చర్చలు జరిపి ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. ఆ తర్వాత లొంగిపోవాలని హైజాకర్‌ను హెచ్చరించినా అతను వినకపోవడంతో అతనిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న కాసేపటికే నిందితుడు మరణించాడు.