‘మణికర్ణిక’ సినిమా విషయంలో డైరెక్టర్ క్రిష్, కంగన రనౌత్ మధ్య వివాదం నానాటికీ ముదురుతోంది. తాను తీసిన సినిమా ఇది కాదని, కంగనా మూర్ఖంగా వ్యవహరించిందని క్రిష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కంగనా సోదరి రంగోలి చండేల్ బదులిస్తూ.. కేవలం పది నిమిషాల్లోనే మీ బుడగ పగిలిపోతుందని క్రిష్ కాదనడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే కంగనా జోక్యం చేసుకొని సినిమాను పూర్తి చేసే బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారని ఆమె తెలిపారు. క్రిష్ కోసం విజయేంద్ర ప్రసాద్‌తో అక్టోబర్ 4న కంగనా చేసిన వాట్సప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను రంగోలి బయటపెట్టారు. క్రిష్ కి క్రెడిట్ ఇవ్వడం కోసం కంగనా పోరాడిందని, కానీ తమకు అతడి సహకారం అవసరమని విజయేంద్ర ప్రసాద్‌ను కోరిందని ఆమె తెలిపారు. నేను చెప్పడంతోనే కంగనా ‘మణికర్ణిక’ను షూట్ చేసిందని చెప్పాలని అందులో తప్పేం లేదని మీడియా స్టేట్మెంట్ ఇప్పించాలని కంగనా ఆ చాట్‌లో కోరారు. క్రిష్ తీరుతో కమల్ జైన్, జీ స్టూడియోస్ వాళ్ళు అప్సెట్ అయ్యారని, అతడికి క్రెడిట్ ఇవ్వాలని అనుకోలేదని ఆ చాట్ లో ఉంది. దీంతో తనపై ఆరోపణలు రావడం పట్ల క్రిష్ ట్విట్టర్లో స్పందించారు. రంగోలిని ట్యాగ్ చేస్తూ.. ‘ఒక వ్యక్తి అబద్ధాలు, అవకతవకల కారణంగా నా శక్తిసామర్థ్యాలను నేను డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేద’ని క్రిష్ ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించిన కంగనా ముందుచూపుతోనే వాట్సాప్ సందేశాలను సిద్ధం చేసుకుందని, అవన్నీ అబద్ధాలని క్రిష్ తెలిపారు. మణికర్ణిక సినిమాకు ఎడిటర్‌గా పని చేసి తర్వాత బయటకొచ్చిన సూరజ్ వాట్సప్ చాట్‌ను క్రిష్ ట్వీట్ చేశారు. మణికర్ణిక మూవీని చూశాను. మీరు షూటింగ్ చేసిన, నేను ఎడిట్ చేసిన పార్ట్ బాగుంది. అదో అద్భుత కళాఖండం, కానీ దాన్ని నాశనం చేశారు. ఈ సినిమా చరిత్రను సరిగా చూపించలేదు. అందులోని తాంతియా, సదాశివరావు, కాశీ, పేష్వా, గంగాధర్ లాంటి ముఖ్య పాత్రలను మీరు తెరకెక్కించారు. కానీ రిలీజైన సినిమాలో మాత్రం ఆ పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేశారు. సోనూసూద్ పాత్ర ఎంతో కీలకం కానీ సినిమాలో మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. వాళ్లేం షూట్ చేశారో నాకు అర్థం కాడం లేదు, నేను ఎడిట్ చేసిన భాగాన్ని సినిమాలో ఉంచుతారా? అని జీ స్టూడియోస్ కు మెయిల్ చేశాను. కానీ వారి నుంచి స్పందన లేదు. కానీ సినిమా చూశాక నేను ఎడిట్ చేసిన దానికి రీషూట్ చేసిందాన్ని జత చేశారని అర్థమైంది. నా ఎడిటింగ్ భోజ్‌పూరీ ఎడిట్ లా ఉందని చులకనగా మాట్లాడారు. కానీ నాకు క్రెడిట్ ఇవ్వకుండా నేను ఎడిట్ చేసిన దాన్ని ఎలా వాడుకుంటారని అని సూరజ్ ప్రశ్నించారు. మణికర్ణికను 75 శాతం షూట్ చేశానన్న కంగనా వ్యాఖ్యలు అబద్ధం అని అసిస్టెంట్ డైరెక్టర్ నటాషా మెసేజ్ చేసిన స్క్రీన్ షాట్ లు షేర్ చేశారు. సెట్స్‌కి రావడం, ప్యాచ్ వర్క్ చేసింత మాత్రాన అది డైరెక్షన్ కాదని అద్భుతమైన సినిమాను నాశనం చేయడం మనోవేదన కలిగిస్తుందన్నారు. ఈ సినిమా విషయంలో మీ విజన్ ఎంతో బెటర్ అని క్రిష్‌తో వాట్సప్ చాట్ ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్‌ను క్రిష్ బయటపెట్టారు.