మహారాష్ట్ర నుంచి వచ్చే “ప్రధాని” ఆయనేనా…?

More Than One Maharashtrian Would Occupy PM Post By 2050

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ” కొత్తగా వచ్చే ప్రధాని మహారాష్ట్ర వాసి ఎందుకు కాకూడదు..?” అని ఆయన చేసిన వ్యాఖ్య శివసేన లాంటి మరాఠా పార్టీల దగ్గర్నుంచి విశేషం కాదు కానీ బీజేపీ నేత అదీ ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి నోటి నుంచి వస్తే సంచలనమేగా. ఓ మరాఠీ సదస్సులో పాల్గొన్న సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర నుంచి ఇప్పటి వరకూ ఎవరూ ప్రధానమంత్రిగా పదవి చేపట్టలేదు అని వ్యాఖ్యనించారు. 2050 కల్లా మహారాష్ట్ర నుంచి దేశానికి నాయకత్వం వహిస్తారని చెప్పుకొచ్చారు. మామూలుగా అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వ్యాఖ్యలు పెద్దగా హాట్ టాపిక్ కాదు. కానీ.. ఇప్పుడు.. బీజేపీలో పరిస్థితులు కాస్త తేడాగా ఉన్నాయి. గుజరాత్‌కు చెందిన ప్రధానమంత్రి మోడీ పై ఆరెస్సెస్ తీవ్ర అసంతృప్తితో ఉందన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించడం సాధ్యం కాదని అంచనా వేస్తోందని.. మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. మోడీకి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రొత్సహించాలనుకుంటోందని.. అందుకు మహారాష్ట్రకే చెందిన బీజేపీ ముఖ్య నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని హైలెట్ చేస్తోందని చెబుతున్నారు. దానికి ఊతం ఇస్తూనే గత కొద్ది రోజులుగా నరేంద్రమోడీ, అమిత్ షాలపై నితిన్ గడ్కరీ పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర కేబినెట్‌లో .. అంతో ఇంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఒక్క గడ్కరీకే ఉంది. ఆయనకు ఆ శక్తి రావడానికి ప్రధాన కారణం.. ఆరెస్సెస్ మద్దతేననేది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తమ రాష్ట్రం నుంచే ప్రధాని వస్తారని జోస్యం చెప్పడం ప్రారంభించారు. ఒకటి, రెండేళ్ల కిందటి వరకూ బీజేపీలో నరేంద్రమోడీకి తిరుగులేని నాయకత్వం అనుకున్నారు. ఆయనను ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదనుకున్నారు. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి మారిపోయింది. సొంత పార్టీలోనే ప్రధానమంత్రి అభ్యర్థులు తయారయ్యారు.