ఏడో రోజుకు సీఏం రమేష్, రవిల ఉక్కు దీక్ష…తీవ్రంగా క్షీణించిన ఆరోగ్యం !

MP CM Ramesh and Btech Ravi Health Deteriorates

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేస్తున్న ఆమరణదీక్ష నేటితో 7వ రోజుకి చేరుకుంది. అయితే గత ఆరు రోజులుగా దీక్ష చేస్తుండటంతో సీఎం రమేష్, బీటెక్ రవిల ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది. షుగర్ లెవల్స్ క్రమంగా పడిపోతున్నాయి. అయితే ఆరోగ్యం క్షీణించినప్పటికీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయ్యే వరకు తమ దీక్షను మాత్రం ఆపేదే లేదని ఈ ఇరువురు నేతలు స్పష్టం చేస్తున్నారు. నిన్న వీరిని పరీక్షించిన వైద్యులు రమేశ్, రవి ఇద్దరూ బరువు తగ్గారని…చాలా నీరసంగా ఉన్నారని…షుగర్ లెవల్స్, బీపీ పడిపోయాయని తెలిపారు. మరోవైపు దీక్షతో వీరి ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా వీరి దీక్షను జాతీయ స్థాయిలో హైలైట్ చేయడానికి సిద్దమవుతోంది. ” కడప ఉక్కు – ఆంధ్రుల హక్కు” అనే నినాదం దేశం మొత్తం ప్రతిధ్వనించేలా మూడు రోజుల పాటు భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.

ఈ రోజు ఏపీ వ్యాప్తంగా బైక్ ర్యాలీ, రేపు అన్ని జిల్లాల్లో ధర్నాలు, 28వ తేదీన ఎంపీలందరూ ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించారు. ఇకపోతే ఎంపీలు ఢిల్లీలో చేయనున్న ధర్నాకు.. ప్రాంతీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలందరూ సంఘిభావం ప్రకటించే అవకాశం ఉంది. ఇదే సమయంలో వైసీపీని కార్నర్ చేసేలా చంద్రబాబు పోరాట ప్రణాళికను సిద్ధం చేశారు. వైసీపీ అధినేత సొంత జిల్లాలోనే ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమం చేయకుండా కేసుల మాఫీ చేసుకునేందుకు సైలెంట్ అయిపోయారని తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తామే దీక్షలకు దిగిన విషయాన్ని. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు చంద్రబాబు వ్యోహాలు సిద్దం చేశారని తెలుస్తోంది. ఈ దీక్ష ప్రజల్లో ఎక్కడ సెంటిమెంట్ రగులుస్తుందోనాన్న భయంలో ఉన్న కేంద్రం నిన్న గవర్నర్ తో చంద్రబాబుకు ఫోన్ చేయించింది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసిన గవర్నర్ నరసింహన్ సీఎం రమేష్, బీటెక్ రవిల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వారిద్దరి ఆరోగ్య పరిస్థితులపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదే అంశాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్‌కు సూచించారు.