సావిత్రి కొడుకును క‌లిసిన నాగ్ అశ్విన్

nag-ashwin-met-actor-savitris-son

Posted September 14, 2017 at 15:54 

మ‌హాన‌టి పేరుతో సావిత్రి జీవితాన్ని తెర‌కెక్కిస్తున్న నాగ్ అశ్విన్ ఆ సినిమా కోసం చాలానే క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే సినిమా కోసం ఎంద‌రినో క‌లిసి ఎన్నో వివరాలు సేక‌రించిన ద‌ర్శ‌కుడు తాజాగా సావిత్రి కుమారుణ్ని క‌లిశారు. సినిమాకు అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన స‌మాచారం కోసం నాగ్ అశ్విన్ అమెరికాలో ఉన్న సావిత్రి త‌న‌యుడు ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. సావిత్రి జీవితానికి సంబంధించి కీల‌క‌మైన విష‌యాల‌ను నాగ్ అశ్విన్ తెలుసుకున్నారు. ఈ స‌మాచారం సినిమాకు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చిత్ర యూనిట్ అంటోంది. సావిత్రికి ఒక కుమార్తె, ఒక కొడుకు ఉన్నారు.

సావిత్రి కూతురు విజ‌య‌చాముండేశ్వ‌రి చెన్నైలో సెటిల‌వ్వ‌గా… కొడుకు మాత్రం అమెరికా వెళ్లిపోయారు. విజ‌య‌చాముండేశ్వ‌రికి సినిమాల‌తో సంబంధం లేక‌పోయినా..అప్పుడ‌ప్పుడు సావిత్రికి సంబంధించిన కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ ప్ర‌జ‌ల‌కు క‌నిపిస్తున్నారు. సావిత్రి జీవితాన్ని తెర‌కెక్కించేందుకు ఆమె అనుమతి ఇచ్చారు. ద‌శాబ్దాల పాటు వెండితెర‌ను ఏలిన సావిత్రి కెరీర్ లో ఏ హీరోయిన్ చేరుకోలేని ఉన్న‌త‌శిఖ‌రాల‌ను అధిరోహించారు. అదే స‌మ‌యంలో వ్య‌క్తిగ‌త జీవితంలో మాత్రం తీవ్ర ఒడిదుడుకుల‌కు లోన‌య్యారు. అదే సావిత్రి ప‌త‌నాన్ని శాసించింది.

చివ‌రిరోజుల్లో డిప్రెష‌న్ తో తాగుడికి బానిసై చేతులారా మ‌ర‌ణాన్ని కొనితెచ్చుకున్నారు. సావిత్రి జీవితం ప్ర‌తి హీరోయిన్ కు గుణ‌పాఠం లాంటిది. సావిత్రి జీవితంలో అంద‌రికీ తెలిసిన సంఘ‌ట‌న‌ల‌తో పాటు… ఇప్ప‌టిదాకా ఎవ‌ర‌కూ తెలియ‌ని అనేక విశేషాల‌ను మ‌హాన‌టి లో చూపించ‌నున్నారు నాగ్ అశ్విన్. చాలా రోజుల క్రిత‌మే ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌యింది. కొన్నిరోజులు అంత‌ర్వేదిలో షూటింగ్ జ‌రిపిన సినిమా టీమ్ ప్ర‌స్తుతం పాల‌కొల్లులో ఉంది. అక్క‌డ కొన్ని ముఖ్య‌మైన సన్నివేశాల‌ను చిత్రీక‌రించనున్న‌ట్టు తెలుస్తోంది. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేశ్ న‌టిస్తుండ‌గా… స‌మంత‌, ప్ర‌కాశ్ రాజ్, దుల్క‌ర్ స‌ల్మాన్ కీల‌క‌పాత్రలు పోషిస్తున్నారు.

SHARE