Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగులో రెజీనా నటిస్తున్న సినిమాలు తక్కువే అయినా ఆమె గురించి మీడియాలో వస్తున్న వార్తలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఆ మద్య వరుసగా సాయి ధరమ్ తేజ్‌తో సినిమాలు చేయడం వల్ల ఆయనతో ప్రేమ వ్యవహారం సాగిస్తుందని, ఇద్దరి ప్రేమ వ్యవహారం చాలా దూరం వరకు వెళ్లిందని, మెగా ఫ్యామిలీలో ఈ ప్రేమ వ్యవహారమై సీరియస్ చర్చ జరుగుతుందని ప్రచారం జరిగింది. ఆ వార్తలను సాయి ధరమ్ తేజ్, రెజీనాలు కొట్టి పారేశారు. తాజాగా ఈ అమ్మడు నారా హీరో రోహిత్‌తో ప్రేమలో మునిగి తేలుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.
నారా రోహిత్, రెజీనాలు కలిసి ఇప్పటి వరకు ‘శంకర’, ‘జ్యో అచ్యుతానంద’, ‘బాలకృష్ణుడు’ చిత్రాల్లో నటించారు. తాజాగా వీరిద్దరు కలిసి నటించిన సినిమాలో గతంలోని సినిమాల కంటే కాస్త అతిగా రొమాన్స్ చేయడంతో పాటు, ఇద్దరు చాలా సన్నిహితంగా కనిపించారట. దాంతో ఇద్దరి మద్య వ్యవహారం సాగుతుందనే ప్రచారం మొదలు అయ్యింది. రెజీనాతో నారా రోహిత్ ప్రేమలో ఉన్నాడని, ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటారు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా మీడియాలో వస్తున్న వార్తలపై నారా రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. తామిద్దరం ప్రేమలో ఉన్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, మేం కలిసి మూడు సినిమాల్లో నటించడం వల్ల ఇలాంటి ప్రచారం మొదలై ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో రెజీనా నటిస్తోంది. అయితే మంచి బ్రేక్ మాత్రం ఈమెకు దక్కడం లేదు.