ఒకటా రెండా వరుసగా ప్లాపుల మీద ప్లాపులు. సోలో హీరోగా చేసిన సరే, మల్టీస్టార్రర్ చేసిన సరే…ఫలితం మాత్రం ఒక్కటే…డిజాస్టర్. ఇది నారా వారి హీరో నారా రోహిత్ పరిస్థితి. చేసేవాటిలో దాదాపుగా విభిన్న కథాంశాలే. పోనీ ఈసారి కమర్షియల్ సినిమాతో హిట్ కొడదామని బాలకృష్ణుడు అనే సినిమా చేసి కూడా చేతులు కాల్చుకున్నాడు. ఇన్ని వరుసపెట్టి ప్లాపులు ఇస్తున్నా, నారా రోహిత్ నటనకి, గాత్రానికి, సినిమాలకి అభిమానులు ఉన్నారు అనేది కాదనలేని విషయం.
ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని నిర్ణయించుకొని, తనని హీరోగా తెలుగు తెర కి పరిచయం చేసిన దర్శకుడు చైతన్య దంతులూరి తో మరో చిత్రం చేయబోతున్నాడు. వీరిద్దరూ బాణం అనే సినిమాతో ఒకేసారి తెలుగు తెర కి పరిచయం అయ్యారు. బాణం సినిమా అటు డైరెక్షన్ పరంగా నెమ్మదిగా సాగినా, ఇటు నటన పరంగా మాత్రం నారా రోహిత్ కి మంచి మార్కులనే వేయించింది. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి జతకట్టి, పీరియాడిక్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా 1971 లో జరిగిన యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా టీం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసుకొని, త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టేందుకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికి వెలువడకపోయినా, అతి త్వరలోనే వెలువడొచ్చని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
దర్శకుడు చైతన్య దంతులూరి గురించి చెప్పుకోవాలంటే, 2009 లో బాణం సినిమా తీసిన ఈయన మళ్ళీ 2014 లో బసంతి సినిమాని తీశాడు. మళ్ళీ ఇప్పుడు 2019 లో తన మూడవ సినిమాని మొదలుపెట్టబోతున్నాడు. అంటే, సినిమా సినిమాకి ఈ డైరెక్టర్ తీసుకుంటున్న సమయం అక్షరాలా 5 సవంత్సరాలు. ఇన్ని సవంత్సరాల సమయం తీసుకుంటే, ఇంకెవరైనా డైరెక్టర్ అయితే ఐదేసి బాహుబలి సినిమాలు తీసేవాడా అనిపిస్తుంది. ఏదేమైనా నారా రోహిత్ కి ఇప్పుడు ఒక హిట్ చిత్రం చాలా అవసరం. అది ఈ చైతన్య దంతులూరి ఇస్తాడని ఆశిద్దాం.