Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాస్ మహారాజ దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని రవితేజకు మంచి రీ ఎంట్రీని ఇచ్చింది. ఇక ఆ చిత్రంతో ప్రారంభం అయిన ‘టచ్ చేసి చూడు’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ముందే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. చివరకు ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అయితే ఇటీవల ప్రకటించిన విధంగా సంక్రాంతికి కాకుండా మరో తేదీకి ఈ చిత్రాన్ని వాయిదా వేయడం జరిగింది.
సంక్రాంతికి పెద్ద చిత్రాలు రెండు బరిలో దిగేందుకు సిద్దంగా ఉన్నాయి. అందులో ఒకటి పవన్ ‘అజ్ఞాతవాసి’ కాగా రెండవది బాలయ్య ‘జైసింహా’. ఈ రెండు చిత్రాలతో పోటీ పడటం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని భావించారో లేదా మరేదైనా ఆలోచించారో కాని సినిమాను రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేయాలని నిర్ణయించారు. రవితేజ పుట్టిన రోజు జనవరి 26. పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు అంటే జనవరి 25న టచ్ చేసి చూడు విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిపబ్లిక్ డేకు అనుష్క ‘భాగమతి’ చిత్రాన్ని విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. దాంతో పాటు ఇంకా పలు చిత్రాలు కూడా రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల కాబోతున్నాయి. వాటికి రవితేజ టచ్ చేసి చూడు చిత్రం గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. విక్రమ్ సిరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా మరియు శీరత్ కపూర్లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.