Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ అభిమానులు, కత్తి మహేష్ మధ్య మాటల యుద్ధం పాటల యుద్ధంగా మారింది. అజ్ఞాతవాసి లో పవన్ ఆలపించిన కొడకా… కోటేశ్వరరావు ఖరుసైపోతవురో… పాటను ఆయన ఫ్యాన్స్ స్ఫూఫ్ చేసి కత్తి మహేష్ పై ప్రయోగించారు. కత్తిని తిట్టకుండానే తిడుతూ, కొట్టకుండానే కొడతామని హెచ్చరిస్తూ ఈ పాట విడుదల చేశారు. ఒరిజినల్ సాంగ్ లో ఉన్న కొన్ని తిట్లను యథాతథంగా కత్తి మీద ప్రయోగించడం ద్వారా వినూత్న నిరసనను పవన్ ఫ్యాన్స్ ఇలా చూపిస్తున్నారు. ఈ పాట ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది. దీనిపై కత్తి మహేష్ స్పందించారు. పవన్ ఫ్యాన్స్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ నెల 15 వరకూ ఏమీ మాట్లాడొద్దని వారిలో వారే అనుకుని ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు. తాను కూడా సైలెంట్ గా ఉందామని అనుకుంటే ఉండనివ్వడం లేదని ఆరోపించారు. కోన వెంకట్ మీద గౌరవంతో తాను ఏమీ మాట్లాడవద్దని అనుకున్నానని, తనపై ఇప్పుడు జరుగుతున్న దాడికి ఆయన బాధ్యత తీసుకుంటారా అని కత్తి ప్రశ్నించారు. పవన్ అభిమానులు దుర్మార్గులని, తన హక్కులపై దాడి చేయవద్దని వేడుకుంటున్నా వినడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. క్యాన్సర్ తో మరణించిన తన తల్లిని కూడా వాళ్లు వదిలిపెట్టడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీస్ కేసు పెట్టాలని అనుకుంటే ఎన్ని లక్షల మందిపై కేసు పెట్టాలని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ స్పందించి తన అభిమానులను కట్టడి చేయాలన్నదే తన కోరికని చెప్పుకొచ్చారు. ఆయన ఒక్కమాట చెబితే సమస్య పరిష్కారమవుతుందని అన్నారు.