Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కత్తి మహేష్, పవన్ ఫాన్స్ స్వీట్లు పంచుకున్నారు. సన్మానాలు చేసుకున్నారు .అంతకు ముందు వివాదంలో ఒకరి మీద ఇంకొకరు పై చేయి సాధించేందుకు పక్క వాళ్ళ లోగుట్లు బయటకు లాగారు. అవి బయటకు వస్తే జరిగే నష్టాన్ని అంచనా వేసుకుని రెండు వైపులా వ్యూహాత్మకంగా రాజీ చర్చలు జరిగాయి. ఫలించాయి. కానీ ఆ రాజీ ఉత్తుత్తి అని తేలిపోయింది.జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి రాజకీయ యాత్రకు శ్రీకారం చుడుతున్న సందర్భంగా టీవీ 9 చర్చ నడుపుతోంది. అయితే ఈ చర్చలో రాజకీయ నాయకులు ఎవరూ లేరు.
నిన్నమొన్నటిదాకా పవన్ మీద కత్తి దూసిన మహేష్ ని ఆస్థాన విద్వాంసుడి స్థాయిలో కూర్చోబెట్టారు. ఎప్పటిలాగానే ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణితి, ఆలోచన, వ్యూహాల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ మాటలకు, చేతలకు,వాస్తవ పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉందని కత్తి మహేష్ అన్నారు. పాలిటిక్స్ మీద ఏ స్పష్టత లేకుండా రాజకీయ యాత్ర చేయడంతో ప్రయోజనం ఏంటని కత్తి ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన పవన్ ఫ్యాన్ మరి వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నట్టు అని ఎదురు ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు జవాబు ఇస్తూ కత్తి మహేష్ వైసీపీ ని ఓ రేంజ్ లో వెనుకేసుకొచ్చారు. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎత్తి చూపడానికి జగన్ ఓ ప్రణాళికతో పాదయాత్ర చేస్తున్నారని తెగ పొగిడారు. ఈ ఎపిసోడ్ తో కత్తి వెనుక వైసీపీ ఉందన్న విమర్శలకు బలం చేకూరుతోంది. ఓ విధంగా చెప్పాలంటే కత్తి ముసుగు టీవీ 9 లోనే తొలిగిపోయింది. అయినా పవన్ రాజకీయ యాత్ర చేస్తుంటే ఈ స్థాయిలో కత్తిని ఆ చర్చలో పెద్ద పీట వేసి కూర్చోబెట్టారో టీవీ 9 కే తెలియాలి. ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే ఇప్పుడు కత్తి ముసుగు ఆపై టీవీ 9 వేసుకున్న ముసుగు కూడా తొలిగిపోయేట్టు వున్నాయి.