సీమ అంటే ఫ్యాక్ష‌నిజం కాదు… మాన‌వ‌త్వమున్న మ‌నుషులు

JanaSena Party Office Bhoomi Puja At Anantapur

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాయ‌లసీమ అంటే అంద‌రికీ ఫ్యాక్ష‌నిజం క‌నిపిస్తుంద‌ని, త‌న‌కు మాత్రం సీమ ఆట‌, పాట క‌నిపిస్తాయ‌ని, ఒక త‌రిమెల నాగిరెడ్డి, ఒక నీలం సంజీవ‌రెడ్డి, మాన‌వ‌త్వం క‌లిగిన మ‌నుషులు గుర్తుకువ‌స్తార‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు. ఆవేశంతోనో, చ‌ప్ప‌ట్లు కొట్టించుకోడానికో తాను ఈ మాట చెప్ప‌డం లేద‌ని, త‌న చివ‌రి శ్వాస‌వ‌ర‌కు రాయ‌ల‌సీమ‌కు అండ‌గా ఉంటాన‌ని జ‌న‌సేనాని హామీఇచ్చారు. సీమ అంటే క‌ర‌వు నేల కాద‌ని, స‌స్య‌శ్యామ‌ల నేల అనే వ‌ర‌కు ప‌నిచేస్తాన‌ని, రాయ‌ల‌సీమ‌పై త‌న‌కున్న ప్రేమ‌ను తెలియ‌జేసేందుకే అనంత‌పురంలో పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. గుత్తిరోడ్డులో వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన అభిమానులు, కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య జ‌న‌సేన పార్టీ కార్యాల‌యానికి ఆయ‌న భూమిపూజ చేశారు. అనంతరం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించారు.

సినిమాల్లోకి రాక‌ముందు తాను రైతున‌ని, రైతు క‌ష్టాలు త‌న‌కు తెలుస‌ని ప‌వ‌న్ అన్నారు. యువ‌త ఆశ‌యాలు, ఆడ‌ప‌డుచుల బాధ‌లూ తెలుస‌ని, త‌న‌కు అండగా నిలిస్తే… త‌న శ‌క్తి మేర‌కు కృషిచేస్తాన‌ని, త్రిక‌ర‌ణ శుద్ధిగా రాయ‌ల‌సీమ నేల కోసం ప‌నిచేస్తాన‌ని ప‌వ‌న్ చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు తాను అండ‌గా ఉంటాన‌ని ప్ర‌జ‌లు భావిస్తే త‌న‌కు ఓటు వేయాల‌ని, ఓటు వేసినా, వేయ‌క‌పోయినా తాను పోరాటం కొన‌సాగిస్తాన‌ని స్ప‌ష్టంచేశారు. సీమ వ్యాప్తంగా సమ‌స్య‌లు ఉన్న ప్రాంతాల్లో వ్య‌క్తిగ‌తంగా ప‌ర్య‌టిస్తాన‌ని, ఆ త‌ర్వాత మేధావుల‌తో చ‌ర్చించి, స‌మ‌స్య‌కు ప‌రిష్కార మార్గాల కోసం అన్వేషిస్తాన‌ని హామీఇచ్చారు. త‌న‌కు నాయ‌కులంద‌రితోనూ పరిచ‌యాలు ఉన్నాయ‌ని, ఎవ‌రితోనూ శ‌తృత్వం లేద‌ని చెప్పారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను పాల‌కుల దృష్టికి తీసుకువెళ్లి ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నిస్తాన‌న్నారు. స‌మస్య‌ల ప‌రిష్కార సాధ‌న కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబు, కేసీఆర్ ల‌ను కూడా క‌లుస్తాన‌ని జ‌న‌సేనాని చెప్పారు. యువ‌త భ‌విష్య‌త్ కోస‌మే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, సినిమాల కంటే ప్ర‌జాసేవ‌లోనే ఎక్కువ తృప్తి ఉంద‌ని అన్నారు. కుల‌, మ‌త, ఓటు బ్యాంకు రాజ‌కీయాలు తాను చేయ‌బోన‌ని, జ‌న‌సేన పోరాటం కేవ‌లం 2019 కోస‌మే కాద‌ని, 25 ఏళ్ల పాటు సాగే పోరాట‌మ‌ని ప‌వ‌న్న క‌ళ్యాణ్ స్ప‌ష్టంచేశారు.