Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సోషల్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డి గురించి జరిగినంత చర్చా మరెవరి గురించీ జరగలేదంటే అతిశయోక్తి లేదు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రాకపోవడం వంటి విషయాలపై మొదట యూ ట్యూబ్ చానల్స్ కు, తర్వాత న్యూస్ చానళ్లకు శ్రీరెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలు, శ్రీరెడ్డి లీక్స్ పేరుతో ఆమె సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతులు అందరినీ ఉలిక్కిపడేలా చేశాయి. అన్నిచోట్లా అదే హాట్ టాపిక్ అయింది. తన వ్యాఖ్యల సంచలనం కొనసాగుతుండగానే..శ్రీరెడ్డి ఎవరూ ఊహించలేని చర్యకు దిగింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో సభ్యత్వం ఇవ్వలేదని నిరసిస్తూ హైదరాబాద్ ఫిలింనగర్ లోని మా కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసింది. శ్రీరెడ్డి నిరసన తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్ కు గురిచేసింది. ఓ తెలుగమ్మాయి..ఇలాంటి చర్యకు పాల్పడడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెకు అనుకూల, వ్యతిరేక కామెంట్లతో, చర్చలతో సోషల్ మీడియా, టీవీచానళ్లు నిండిపోయాయి.
ఆమెపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయగా..అదేసమయంలో ఆమెపై చాలా మందీ సానుభూతీ చూపిస్తున్నారు. అవకాశాల కోసం ఎదురుచూసీ చూసీ డిప్రెసన్ కు లోనవడం వల్లే శ్రీరెడ్డి ఇలా చేసిందని కొందరు ఆమె మానసిక స్థితిని విశ్లేషిస్తున్నారు. నిజానికి శ్రీరెడ్డి ఎవరన్నా రెచ్చగొడితే ఆవేశంలో ఈ పని చేసిందా…లేక ఆలోచించే చేసిందా అన్న సందేహాలు తలెత్తాయి. తనతో పాటు, తన కుటుంబం, స్నేహితులు, సన్నిహితులు కూడా ఇలాంటి చర్యల వల్ల అవమానాలకు గురికావాల్సి వస్తుందన్న విషయం శ్రీరెడ్డి ఊహించలేదు అని అనుకునేందుకు ఆస్కారం లేదు. ఎందుకంటే ఏదో ఆవేశంలో అప్పటికప్పుడు ఆమె అలా చేయలేదు. ముందుగా ప్రకటించి మరీ ఆమె నడిరోడ్డుపై అర్ధనగ్నంగా కూర్చుంది. కాబట్టి..పర్యవసానాలూ ఆమె ముందే ఊహించిందనే అనుకోవాలి. కానీ ఆలోచనో, ఆవేశమో ఏదైనా గానీ ఇప్పుడుమాత్రం ఆమె తనచర్యపై పశ్చాత్తాపపడుతున్నట్టు ఆమె వ్యాఖ్యలు చూస్తే అర్దమవుతోంది. తన నిరసన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయిన హౌస్ ఓనర్ తనను ఇల్లు ఖాళీ చేయమన్నారని ఆవేదన వ్యక్తంచేసింది. అలాగే తాను ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే ఇలా చేయాలన్న నిర్ణయానికి వచ్చానో ఒక్కసారి ఆలోచించాలని కోరింది.
రేపు తన పిల్లలు ఇలా ఎందుకు చేశావమ్మా అని ప్రశ్నిస్తే ఏం చెప్పాలో తెలియడం లేదని కన్నీరుకూడా పెట్టుకుంది. ఈ ఘటన చూసిన తర్వాత తన తల్లి, తమ్ముడు ఏడ్చారని, కనీసం తనతల్లి ముందు ఎప్పుడూ తను దుస్తులు కూడా మార్చుకోలేదని, అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ లో తన ఫొటోలు చేరిపోవడం చూసి తన తల్లిదండ్రులు కుమిలిపోతున్నారని బాధపడింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలు చూస్తే కాస్టింగ్ కౌచ్, అవకాశాలు రాకపోవడం వంటి పరిణామాలు ఆమెను డిప్రెషన్ లోకి తీసుకెళ్లడంతో…ఫస్ట్రేషన్ తోనే ఇలా చేసిఉంటుందని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేయడం, ఆమెను సినిమాల్లో నటించనివ్వకుండా నిషేధించడం వంటివి ఈ సమస్యకు పరిష్కారం కాదని, ఇలాంటి వాటి వల్ల ఆమె ప్రవర్తన ప్రవర్తన మరింత దిగజారే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. ఆమెకు టాలీవుడ్ యావత్తూ అండగా ఉందన్న భరోసా ఇవ్వడం, ఆమెలో తీవ్రస్థాయిలో పేరుకుపోయిన నిరాశానిస్పృహలను తొలగించే ప్రయత్నం చేయడం ద్వారానే ఆమె మానసిక స్థితిని సరైన దారిలో పెట్టవచ్చని సూచిస్తున్నారు.