తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని వ్యాజ్యం సాధించింది తెరాస. అయినా సరే ఎందుకో గానీ ఆ పార్టీ గెలుపుని స్వీకరించే పరిస్థితిలో కాంగ్రెస్ నేతలు లేరు. అందుకే ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రాష్ట్ర కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఫిర్యాదు చేయాలనుకున్నా సమయం కుదరలేదని, అందుకే ఆయనకీ లేఖ రాస్తున్నానని పొన్నాల అన్నారు. పోలింగ్ రోజున చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయలేదని, వాటి స్థానంలో తప్పుడు ఈవీఎంలు పెట్టి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. ఎన్నికలు జరిగిన 36 గంటల తర్వాత కూడా ఎంత శాతం పోలింగ్ నమోదైందనే విషయాన్ని ఎన్నికల కమిషన్ ప్రకటించలేదని కానే అదే సంయమలో తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన 3 గంటల్లో పోలింగ్ శాతం అక్కడి ఎన్నికల అధికారులు వెల్లదించారని, ఆ రాష్ట్రాల కంటే తక్కు వ అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో మాత్రం 36 గంటలు పట్టిందని తెలిపారు.
అయితే పోలింగ్ సమయంలో, ఆ తర్వాత అక్రమాలు చేసినందుకే ఆ ప్రకటన చేయడానికి ఇంత సమయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణకు ఆదేశించాలని, అలాగే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రపతిని కోరారు. ఎన్నికల ముందే టీఆర్ఎస్ అధినేత చెప్పినట్లుగానే ఫలితాలొచ్చాయని, పేర్లతో సహా ఆయన చెప్పిన వారే గెలిచారని, ఇది కూడా ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు సాక్షమని పొన్నాల పేర్కొన్నారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని, పోలైన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు కౌంటింగ్ ఎందుకు జరిగిందో ఈసీ ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదని అన్నారు. అంతేకాక కొన్నిచోట్ల చనిపోయిన వ్యక్తు లు కూడా ఓట్లు వేసినట్టు నమోదైందని పేర్కొన్నారు. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.