Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం తన కొడుకు ఆకాష్ పూరితో ‘మెహబూబా’ అనే చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. పాకిస్తాన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల వారిలో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. చిన్నప్పటి నుండి సినిమాల్లో నటిస్తూ వస్తున్న ఆకాష్ పూరి ఈ చిత్రంలో పూర్తి స్థాయి హీరోగా కనిపించబోతున్నాడు. పలువురు హీరోలకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాధ్ తన తమ్ముడు సాయి రాం శంకర్‌ను మాత్రం హీరోగా నిలబెట్టడంలో విఫలం అయ్యాడు. తమ్ముడి విషయంలో జరిగింది కొడుకు ఆకాష్ విషయంలో జరగవద్దనే ఉద్దేశ్యంతో పూరి ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఆకాష్‌తో ప్రస్తుతం చేస్తున్న ‘మెహబూబా’ చిత్రం విడుదలైన వెంటనే మరో సినిమాను కూడా కొడుకుతోనే పూరి ప్లాన్ చేస్తున్నాడు. కొడుకును మాస్ హీరోగా ప్రేక్షకుల ముందు నిలబెట్టాలని, బాక్సాఫీస్ వద్ద మంచి సత్తా ఉన్న హీరోగా నిరూపించాలని పూరి భావిస్తున్నాడు. అందుకే కొడుకుతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలే కాకుండా కొడుకు కోసం ఇంకా పలు సబ్జెక్ట్‌లను సైతం పూరి తన కొడుకు కోసం సిద్దం చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఒక తండ్రిగా దర్శకుడు పూరి కొడుకు సక్సెస్ కోసం తపన పడుతున్నాడు. ఆకాష్‌ను పూర్తి స్థాయి కమర్షియల్ హీరోగా నిలబెట్టే వరకు వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆకాష్ కమర్షియల్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడా అనేది చూడాలి.