Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశంలో వరుసగా వెలుగుచూస్తున్న దారుణ అత్యాచార ఘటనలపై సినీ సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అత్యాచారాలను నియంత్రించలేని ప్రభుత్వాలపై మండిపడుతున్నారు. కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలపపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో తమ బాధను పంచుకున్నారు. టాలీవుడ్ హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ అయితే..తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్ లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిందని, మరో ఘటనలో అత్యాచారానికి గురై, తండ్రిని పోగొట్టుకున్న ఓ 16ఏళ్ల యువతి న్యాయం కోసం పోరాడుతోందని తమన్నా ఆవేదన వ్యక్తంచేసింది. నా దేశం ఎటువెళ్తోంది..? చట్టాలు వచ్చే వరకు ఇంకెంతమంది నిర్భయలను త్యాగం చేయాలి? ఓ స్త్రీని క్షేమంగా చూసుకోలేని దేశం మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టే..ఈ దేశానికి చికిత్స అవసరం అని తీవ్రంగా స్పందిస్తూ తమన్నా ట్వీట్ చేసింది. నకిలీ జాతీయవాదులను, నకిలీ హిందువులను చూసి షాకయ్యాను. సిగ్గుపడుతున్నాను.
నా దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే నమ్మలేకపోతున్నాను అని సోనమ్ కపూర్ మండిపడింది. బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ కథువా దారుణంపై చలించిపోయాడు. ఎనిమిదేళ్ల బాలికకు మాదక ద్రవ్యాలు ఇచ్చి అత్యాచారం చేసినప్పుడు ఆ చిట్టి తల్లి ఎంత నరకం అనుభవించి ఉంటుందో ఆలోచించండి. నిర్బంధించి, రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడి చంపేశారు. ఆ బాధను ఊహించలేనివాడు, ఆమెకు న్యాయం జరిగేలా చూడలేని వాడు మనిషేకాదని ఫర్హాన్ అక్తర్ ట్వీట్ చేశాడు. ఎనిమిదేళ్ల అమాయక చిన్నారిపై అత్యాచారం చేశారు. ఈ సమయంలో దేవుడు ఎక్కడ అని మాత్రమే అడగగలను. ఇంత నీచమైన, క్రూరమైన మనుషులు ఈ గ్రహంలోనే ఉండరు. అత్యాచార నిందితులకు వేయడానికి తగిన శిక్ష కూడా లేదు అని సిమి గరేవాల్ ట్వీట్ చేశాడు. సెలబ్రిటీలే కాదు..తీవ్ర సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావ్ అత్యాచారాల నేపథ్యంలో బాలికల భద్రతపై ..దేశమంతా ఆందోళన వ్యక్తంచేస్తోంది. గత జనవరిలో కథువా దారుణ అత్యాచారం వెలుగుచూసింది. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఆరుగురు సామూహిక అత్యాచారం జరిపి అనంతరం హత్యచేశారు.
ఈ దారుణానికి ఒడిగట్టినవారిలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు కూడా ఉండడం భయాందోళనలు కలిగించింది. ఈ ఘటనలో పోలీసులు 15 పేజీల ఛార్జ్ షీట్ దాఖలుచేసి, విస్తుపోయే నిజాలు పొందుపర్చారు. మొత్తం ఆరుగురు నిందితులు వారం రోజుల పాటు బాలికను బంధించి ఓ ప్రార్థనా మందిరంలో ఉంచి నిత్యమూ అత్యాచారం జరిపారని, బాలికను ఎప్పుడూ మత్తులోనే ఉంచారని పోలీసులు చెప్పారు. వీరిలో ఐదుగురు అదే ప్రాంతానికి చెందినవారు కాగా, మిగిలిన ఓ నిందితుడు మీరట్ కు చెందిన వారి స్నేహితుడని, ఆ నిందితుడు స్నేహితుల ఆహ్వానం మేరకు 580 కిలోమీటర్లు ప్రయాణించి జమ్మూకాశ్మీర్ కు వచ్చి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడని తెలిపారు.
ప్రణాళిక ప్రకారం నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారని, ఖతువా సమీపంలోని రాసన్నా ప్రాంతంలో నివసించే భకేర్వాల్ వర్గాన్ని తీవ్ర భయకంపితులను చేయడమే వారి ఉద్దేశమని, ప్రార్థనా మందిరం కేర్ టేకర్ గా ఉన్న సంజీ అనే వ్యక్తి మొత్తం నేరానికి బాధ్యుడని పోలీసులు తమ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మరో అత్యాచార కేసులో ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నిందితుడు. గత ఏడాది జూన్ 4న ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని, దీనిపై ఎవరికైనా ఫిర్యాదుచేస్తే తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని, తర్వాత మరో మారు తనను అపహరించి మత్తుపదార్థాలు ఎక్కించి తొమ్మిదిరోజులపాటు అనేక ప్రాంతాలు తిప్పుతూ పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని 16 ఏళ్ల బాలిక ఆరోపిస్తోంది. ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆ బాలిక యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇంటిముందు ఆత్మహత్యా యత్నం చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది.