Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్రప్రభుత్వంపై టీడీపీ, వైసీపీ పెట్టిన అవిశ్వాసతీర్మానాలపై చర్చకు సహకరించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఆ పార్టీ ఎంపీలు కేశవరావు, జితేందర్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్రప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాసతీర్మానాన్ని టీఆర్ ఎస్ అడ్డుకుంటోందనే వాదనలో నిజం లేదన్నారు కేశవరావు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేశవరావు మీడియాకు వివరించారు. కేంద్రంపై అవిశ్వాసతీర్మానానికి అడ్డుతగలకుండా ఉండాలని తాము ఈ సమావేశంలో నిర్ణయించామని కేశవరావు తెలిపారు. తాము చేస్తున్న న్యాయబద్ధమైన నిరసనను సాకుగా చూపి కేంద్రప్రభుత్వం తమ స్వప్రయోజనం కోసం సభను వాయిదా వేసుకుంటూ పోతోందని విమర్శించారు. అవిశ్వాసంపై చర్చ జరగకుండా పార్లమెంట్ వాయిదాపడడానికి కొందరు తమను కారణంగా చూపుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని, తాము తొలి నుంచీ రిజర్వేషన్ల సాధనకు అనేక పద్ధతుల్లో ఉద్యమిస్తున్నామని కేశవరావు తెలిపారు.
టీడీపీ అవిశ్వాసతీర్మానాన్ని టీఆర్ ఎస్ అడ్డుకుంటోందనడం అపవాదు మాత్రమేనని, బీజేపీని కాపాడాల్సిన అవసరం తమకు లేదని స్పష్టంచేశారు. ఇకపైనా తమ నిరసన కొనసాగుతుందని, అయితే ప్లకార్డులతో వెల్ లోకి వెళ్లబోమని చెప్పారు. రిజర్వేషన్లపై తమది న్యాయబద్ధమైన పోరాటమని, ఈ అంశంపై తాము పట్టుదలతో ఉన్నామని కేశవరావు చెప్పారు. రాష్ట్రంలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు చేయాల్సి ఉందని, ఈ అంశంపై నాలుగేళ్లగా కేంద్రం ఎటూ తేల్చకపోవడం వల్లే పార్లమెంట్ లోపలా, వెలుపలా ఆందోళన చేస్తున్నామని మరో ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. టీడీపీ, వైసీపీ అవిశ్వాసం పెట్టకముందు నుంచీ టీఆర్ఎస్ ఆందోళన చేస్తోందని, కానీ తామే చర్చకు అడ్డుపడుతున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. అవిశ్వాసం చర్చకు వస్తే సహకరించాలని పార్లమెంటరీ పార్టీ భేటీలో నిర్ణయించామని, చర్చలో తమ సమస్యలు వివరిస్తామని జితేందర్ రెడ్డి చెప్పారు.