Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉదయం, ఆంధ్రపత్రిక తెలుగు నేలపై చాలా మంది అభిమానాన్ని పొందినప్పటికీ ఆర్ధిక ఇబ్బందులతో నిష్క్రమణకు గురయ్యాయి. ఆ దిన పత్రికలు మళ్లీ ముద్రణకు నోచుకోబోతున్నట్టు కొంత కాలంగా వినిపిస్తున్న మాట. అయితే ఆ రెండు పత్రికలకు సంబంధించి ఏ రాజకీయ నేత లేదా వ్యాపారవేత్త పేరు ముందుకు రావడం లేదు. కేవలం ఒకప్పుడు ఆ సంస్థల్లో విలేకరులుగా పనిచేసి తమ వృత్తిలో ఎదిగిన కొందరు ఆ పత్రికలకి తిరిగి ప్రాణం పోయడానికి కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది.
1984 లో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆధ్వర్యంలో ఉదయం దినపత్రిక ప్రారంభం అయ్యింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతులు మీదుగా ప్రారంభం అయిన కొద్ది కాలంలోనే పాపులర్ అయ్యింది. కేవలం నెల వ్యవధిలో ఆ పత్రిక సర్క్యూలేషన్ 2 ,24 ,000 కి చేరడం అప్పట్లో ఓ సంచలనం. అయితే ఆర్ధిక నిర్వహణలో లోపాలతో ఉదయం యాజమాన్యం మారింది. మాగుంట సుబ్బిరామిరెడ్డి చేతుల్లోకి వెళ్ళింది. అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోవడంతో పత్రిక మూతపడింది. ఆ రోజుల్లోనే నెలకి 32 లక్షల నష్టం తెచ్చుకున్న పత్రిక 15 కోట్ల డెఫిషిట్ లో పడింది. ఆ పత్రికని తిరిగి ప్రారంభించాలని దాసరి ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. కానీ ఆయన మరణం తర్వాత అందులో పనిచేసిన జర్నలిస్టులు ఉదయం ని తిరిగి తేనున్నట్టు ఓ సభలో ప్రకటించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైన ఆర్ధిక మూలాలు లేకుండా పత్రిక తేవడం కష్టమే. కానీ జర్నలిస్టులు ముందుకు రావడం పెద్ద విషయమే.
ఇక ఆంధ్రపత్రిక విషయం తీసుకుంటే 100 ఏళ్ళకిపైగా చరిత్ర వుంది. కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారి చేతుల మీదుగా 1908 లో ఆంధ్రపత్రిక మొదలైంది. తొలుత వార్తాపత్రికగా ఉన్నప్పటికీ తర్వాత దినపత్రికగా మారింది. యాజమాన్యాలు మారినప్పటికీ 1991 వరకు ఈ పత్రిక నడిచింది. ఆ తర్వాత మూతపడింది. ఒకప్పుడు ఉదయం నడిపిన మాగుంట దీని కొనుగోలుకు ప్రయత్నించినా ఆ తర్వాత ఆయన మరణంతో పనులు ముందుకు సాగలేదు. ఇక ఇప్పుడు కొందరు సీనియర్ జర్నలిస్టులు ఆంధ్రపత్రిక పునర్వైభవానికి కృషి చేస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పత్రిక నిర్వహణ అతి కష్టం. అయినా ఉదయం, ఆంధ్రపత్రిక తెరవాలన్న ప్రయత్నాల్ని జర్నలిస్టులు ముందుండి నడిపిస్తున్నారు. వీరికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ స్ఫూర్తిగా కనిపిస్తున్నదనుకుంటా. నాడు ఆర్కే ఆంధ్రజ్యోతి పత్రిక బాధ్యతలు నెత్తికి ఎత్తుకున్నప్పుడు దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ కాలక్రమంలో ఆంధ్రజ్యోతి ఎంతగా నిలదొక్కుకుందో చూస్తూనే వున్నాం.
మరిన్ని వార్తలు